maa members health benefits: 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) అధ్యక్షుడు మంచు విష్ణు(Maa association president manchu vishnu) తన కార్యాచరణ మొదలు పెట్టారు. తన ప్రధాన అజెండాల్లో ఒకటైన 'మా' సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఇటీవల వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఆరోగ్యబీమా క్లెయిం కన్నా ఎక్కువ ఖర్చు అయితే, ఆ బిల్లులో కూడా రాయితీ ఇవ్వన్నట్లు ప్రకటించారు. ప్రతి ఆస్పత్రిలో కేవలం 'మా' సభ్యుల కోసమే ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక మహిళా సభ్యులు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారి చికిత్స కోసం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు(maa members health benefits). ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకు అత్యుత్తమ చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా 'మా' సభ్యులకు ప్రత్యేకంగా చికిత్స అందించి, బిల్లులో రాయితీలు కల్పిస్తున్న వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి(ఏఐజీ), డాక్టర్ భాస్కర్‌రావు(కిమ్స్), సంగీత(అపోలో), డాక్టర్ సుబ్రమణియం(సీఈవో అపోలో), డాక్టర్ గురవారెడ్డి(సన్‌షైన్), డాక్టర్ అనిల్ కృష్ణ(మెడికవర్)లను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు. తనతో పాటు డాక్టర్ మాదాల రవి, శివ బాలాజీ కూడా ఉన్నారని వివరించారు. 'మా' సభ్యుల ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చులో 50శాతం రాయితీ ఇస్తామన్న టెనెట్ డయాగ్నస్టిక్స్ మేనేజ్‌మెంట్ సురేశ్, చరణ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.