తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాట కంచు.. మనసు మంచు.. ఆయనే మోహన్‌బాబు

నటుడిగా, నిర్మాతగా చిత్రసీమకు ఎనలేని సేవలు చేశారు ప్రముఖ నటుడు మోహన్​బాబు. నటనలో రాణించాలనే లక్ష్యంతో ఈ రంగంలో అడుగుపెట్టి.. ఎన్నో అవరోధాలను అధిగమించి, మరెన్నో మైలురాళ్లను దాటుకొని ఎనలేని కీర్తిని గడించారు ఆయన. శుక్రవారం (మార్చి 19) మోహన్​బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

manchu mohan babu birthday special story
మాట కంచు.. మనసు మంచు.. ఆయనే మోహన్‌ బాబు

By

Published : Mar 19, 2021, 10:26 AM IST

భక్తవత్సలం నాయుడు.. అనగానే కొద్దిమందికే తెలుస్తుంది. అదే మోహన్‌బాబు అనగానే ప్రేక్షకులందరి కళ్లలో ఆయన బొమ్మ కనిపిస్తుంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీళ్లు రీళ్లుగా కదలాడి వారి పెదాలపై నవ్వుల పువ్వులు పూస్తాయి. ఎక్కడో.. రాయలసీమ చిత్తూరు ప్రాంతంలోని మారుమూల పల్లెలో పుట్టి పెరిగినా.. తెరపై తనని తాను ఆవిష్కరించుకోవాలనే సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆ దారిలో ఎదురైన ఎన్నో అవరోధాలను అధిగమించి, మరెన్నో మైలురాళ్లను దాటి విజేతగా నిలిచారు. అందుకే ఆయన యువ సినీతారలకు స్ఫూర్తిగా చెప్తుంటారు.

మోహన్​బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోన్న మోసగాళ్ళు టీమ్​

సీమ బిడ్డ

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మర్చి 19న భక్తవత్సలం నాయుడు జన్మించారు. తండ్రి మంచు నారాయణస్వామి, తల్లి లక్షమ్మ. తండ్రి ఉపాధ్యాయుడు. మోహనబాబుకు రంగనాధ్‌ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ అనే ముగ్గురు తమ్ముళ్లున్నారు. సోదరి విజయ కూడా ఉంది. ఏర్పేడు, తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన భక్తవత్సలం నాయుడు చెన్నై వైఎంసీఏ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం తన తండ్రిలాగానే ఉపాధ్యాయ వృత్తి భాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

తల్లిదండ్రులతో మోహన్​బాబు

రంగుల ప్రపంచం మీద మక్కువ ఎక్కువ కావడం వల్ల ఆయన మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరి కొంతకాలం శిక్షణ పొందారు. తర్వాత సినీ అవకాశాల వేటలో పడ్డాడు. సినిమాల్లో పనిచేయాలనే అభిరుచి ఉన్నప్పటికీ ఇండస్ట్రీ రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలకలేదు. ఆయన ఓర్పును పరీక్షించింది. స్టూడియోల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

మోహన్​ బాబు

ఆ ప్రయత్నాలు ఫలించి 1969లో దర్శకుడు లక్ష్మీ దీపక్‌ దగ్గర నుంచి అప్రెంటీస్‌గా పనిచేసే అవకాశాన్ని అందుకున్నాడు. అదీ ఆయనకు దక్కిన మొదటి అవకాశం. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా వెనువెంటనే లక్ష్మీ దీపక్‌ దగ్గర అప్రెంటీస్‌గా చేరిపోయాడు. అలా కొంత కాలం తెర వెనుక దర్శకత్వశాఖలో పనిచేశాడు. 1974లో 'కన్నవారి కలలు', 'అల్లూరి సీతారామరాజు' చిత్రాల్లో కాసేపు కనిపించే అవకాశం ఆయన్ని వరించి వచ్చింది. ఆ సమయంలోనే టాలీవుడ్‌లో స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేస్తున్న దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడింది.

దాసరి నారాయణ రావు, మోహన్​బాబు

'స్వర్గం-నరకం'తో గుర్తింపు

దాసరి నారాయణరావు దర్శకుడిగా మారిన సందర్భంలో భక్తవత్సలం నాయుడికి కూడా ఆ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చింది. అదే 'స్వర్గం-నరకం' చిత్రం. సంసారం స్వర్గ సీమ కావాలన్నా, నరక కూపం అవ్వాలన్నా భార్యాభర్తల చేతుల్లోనే ఉందనే సందేశాత్మక చిత్రం అది. అప్పట్లో ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దర్శకుడిగా దాసరి అభిరుచికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అదే సమయంలో ఆ చిత్రంలోని నటీనటులకు తగిన గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ పోషించిన భక్తవత్సలం నాయుడు.. మోహన్‌బాబు అనే తెర నామంతో క్రమేణ ప్రసిద్ధి పొందారు.

ఆ తర్వాత కామెడీ విలన్‌గా కొన్ని చిత్రాల్లో మోహన్‌బాబు నటించారు. అలనాటి మేటి నటుల సమక్షంలో విలన్‌గా మెప్పించారు. ఏఎన్నార్, ఎన్టీఆర్‌ చిత్రాల్లోనూ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'ఖైదీ కాళిదాసు' చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. నెమ్మదిగా ప్రతినాయకుడి పాత్రల నుంచి కథానాయక పాత్రలకు మోహన్‌బాబు షిఫ్ట్‌ అయ్యారు.

'అల్లుడు గారు' సినిమా పోస్టర్​

1980 దశకం మోహన్‌బాబు ఎదుగుదలకు ఎంతో ఉపకరించింది. 1980లో 'త్రిలోక సుందరి', 'సీతారాములు', 1981లో 'టాక్సీ డ్రైవర్‌', 1982లో 'సవాల్‌', 1983లో 'ప్రళయ గర్జన', 1984లో 'సీతమ్మ పెళ్లి', 1985లో 'తిరుగుబోతు', 1987లో 'విశ్వనాథ నాయకుడు', 1988లో 'ఆత్మకథ' 1989లో 'బ్లాక్‌ టైగర్‌', 1990లో 'ప్రాణానికి ప్రాణం'లాంటి సినిమాలో గుర్తింపు పొందే పాత్రలు వేశాడు. 1992లో 'డిటెక్టీవ్‌ నారద', 1997లో 'వీడెవడండీ బాబు' లాంటి కామెడీ హీరో పాత్రల్లో నటించి మెప్పించాడు. అలాగే, 2002లో 'తప్పు చేసి పప్పు కూడు', 2013లో 'పాండవులు పాండవులు తుమ్మెద' లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. మోహన్​బాబు.. ప్రస్తుతం డైమండ్​ రత్నబాబు దర్శకత్వంలో 'సన్​ ఆఫ్​ ఇండియా' సినిమాలో నటిస్తున్నారు.

'సన్ ఆఫ్​ ఇండియా' పోస్టర్​

గురువు దాసరి.. హితుడు రజనీకాంత్

దర్శకుడు దాసరి నారాయణరావును మోహన్‌బాబు గురువుగా భావిస్తారు. సినీపరంగానే కాకుండా, వ్యక్తిగత విషయాలనూ చనువుగా దాసరి దగ్గర చర్చించి తగిన సలహాలు, సూచనలు స్వీకరించేవారు. ఈ సంగతి వీలు చిక్కినప్పుడల్లా ఆయనే స్వయంగా అనేకసార్లు వెల్లడించారు. ఇక, తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చిత్రసీమలో మోహన్‌బాబుకు అత్యంత శ్రేయోభిలాషి. హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు కూడా. ఆ స్నేహ ధర్మంతోనే రజినీకాంత్‌ 'పెదరాయుడు' సినిమాలో కీలకపాత్ర పోషించి.. ఆ చిత్ర విజయానికి తనవంతు చేయూత ఇచ్చారు. గాయకుడు యేసుదాస్‌ అంటే కూడా మోహన్‌బాబుకు ఎంతో ఇష్టం. తన చిత్రంలో యేసుదాస్‌తో పాడించడం ఆనవాయితీగా చేసుకున్నారు.

'పెదరాయుడు' పోస్టర్

నిర్మాతగా మోహన్‌బాబు

అభిరుచి గల నిర్మాతగానూ మోహన్‌బాబు తనని తాను నిరూపించుకున్నారు. తన కూతురు లక్ష్మి మంచు పేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై 80 చిత్రాలు నిర్మించారు. 1992లో నిర్మాణసంస్థను ప్రారంభించిన మోహన్‌బాబు మొదటి చిత్రంగా 'ప్రతిజ్ఞ' విడుదల చేసారు. ఆ చిత్రం విజయం సాధించడం వల్ల అదే బ్యానర్‌పై 80 చిత్రాలు తీశారు. వాటిలో చెప్పుకోదగ్గవి ఎన్నో ఉన్నా.. 'అసెంబ్లీ రౌడీ', 'రౌడీగారి పెళ్ళాం', 'అల్లుడుగారు', 'మేజర్‌ చంద్రకాంత్‌', 'పెద్ద రాయుడు', 'రాయలసీమ రామన్న చౌదరి' లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

విద్యావేత్తగా

మోహన్‌బాబుకు విద్యారంగం అంటే ఎంతో ప్రీతి. 1992లో శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి రెండు ఇంటర్నేషనల్‌ స్కూల్స్, అయిదు కాలేజీలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి మెండు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేసిన అనుభవం మోహన్​బాబుకు ఉంది.

అవార్డులు-రివార్డులు

  • 2007లో మోహన్‌బాబుని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
    అప్పటి రాష్ట్రపతి అబ్దుల్​ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న మోహన్​బాబు
  • 1995లో 'పెదరాయుడు'లో ప్రదర్శించిన నటనకుగాను ఫిలిం ఫేర్‌ సౌత్‌ ఉత్తమ నటుడి అవార్డుతో సన్మానించింది.
  • 2008లో 'యమదొంగ' సినిమాలో నటనకుగాను బెస్ట్‌ యాక్టర్‌గా సినిమా అవార్డు దక్కింది.
  • 2016లో ఫిలింఫేర్‌ సౌత్‌ మోహన్‌బాబును జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది.
  • 2017లో సైమా స్పెషల్‌ అప్రిషియేషన్‌ అవార్డును మోహన్‌బాబు అందుకున్నారు.
  • టీఎస్సార్‌ కళాపరిషత్‌ 'నట వాచస్పతి' అవార్డుతో మోహన్​బాబును సత్కరించింది.
  • 2018 జనవరిలో టీఎస్సార్‌ కాకతీయ కళాపీఠం 'విశ్వనట సార్వభౌమ' పురస్కారాన్ని మోహన్‌బాబు అందుకున్నారు.
  • 2017 అక్టోబర్‌ 5న చెన్నైలోని డాక్టర్‌ ఎంజీఆర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఇదీ చూడండి:'హాలీవుడ్​ స్థాయిలో రూపొందిన చిత్రం 'మోసగాళ్ళు"

ABOUT THE AUTHOR

...view details