"విడాకుల నేపథ్యంలో సాగే కథల్లో చిన్న రిస్క్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కాకపోవచ్చు. అందుకే మా చిత్రంలో ఆ పాయింట్‌ను సీరియస్‌గా కాకుండా వినోదభరితంగా చెప్పే ప్రయత్నం చేశాం" అని అన్నారు టీజీ కీర్తి కుమార్. ఆయన దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన చిత్రం 'మళ్లీ మొదలైంది'. నైనా గంగూలీ, వర్షిణీ సౌందర్ రాజన్ కథానాయికలు. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు దర్శకుడు కీర్తి కుమార్.
విడాకులు తీసుకున్న వ్యక్తి.. తన కేసు వాదించిన న్యాయవాదితోనే ప్రేమలో పడితే ఏం జరిగిందన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించాం. హాయిగా కుటుంబంతో కలిసి చూసే చిత్రమిది. అసభ్యతకు తావు లేకుండా.. ఎవరి మనోభావాలను నొప్పించని విధంగా ఎంతో జాగ్రత్తగా తీశాం. వాస్తవానికి దీన్ని థియేటర్లు లక్ష్యంగానే తెరకెక్కించాం. ఎడిటింగ్ పూర్తయ్యాక మల్టీప్లెక్స్‌లలోనైనా విడుదల చేద్దామని భావించాం. కరోనా వల్ల థియేటర్లు ఇబ్బంది కావడం వల్ల నిర్మాతలు ఓటీటీ వైపు మొగ్గు చూపారు. జీ5 నుంచి మంచి ఆఫర్ వచ్చేసరికి వాళ్లకిచ్చారు.