'మనసుకు నచ్చింది చేయడమే.. నా దృష్టిలో నిజమైన సక్సెస్. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నేను చేసింది తక్కువ చిత్రాలే అయినా.. ప్రతిదీ మనసుకు నచ్చిందే చేశానన్న సంతృప్తి ఉంది' అని అన్నారు మంజుల ఘట్టమనేని. నటుడు కృష్ణ నటవారసురాలిగా వెండితెరపైకి అడుగు పెట్టిన ఆమె..విలక్షణమైన నటిగా, అభిరుచి గల దర్శక నిర్మాతగా ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. నవంబరు 11(ఆదివారం) ఆమె పుట్టినరోజు. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
అందుకే విరామం..
ఒక సినిమా పూర్తికాగానే మరొకటి అంటూ ఉరుకులు పరుగులుగా చేయడం నాకు నచ్చదు. ఏ స్క్రిప్ట్ ఎంచుకున్నా.. అది నాలో, ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించేలా ఉండాలి. ఆరెంజ్, సేవకుడు చిత్రాల తర్వాత ఎనిమిదేళ్లు తెరకు దూరంగా ఉండటం అన్నది, వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయమే. ఈ విరామంలో ఓ అమ్మగా మాతృత్వంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించా. ఎందుకంటే పిల్లలు పెద్దయ్యాక మనతో ఉండేది తక్కువ. అప్పుడీ ఆనందాల్ని మళ్లీ పొందలేం.
దర్శకత్వమే నా తొలి కల..
నేను చిన్నప్పటి నుంచి దర్శకురాలు అవ్వాలనే కలలు కనే దాన్ని. అది చాలా బరువైన బాధ్యత. ఓ కథను భావోద్వేగభరితంగా తెరపై ఆవిష్కరించడానికి ఎంతో అనుభవం ఉండాలి. అందుకే ముందు నటిగా.. తర్వాత నిర్మాతగా అన్ని విషయాలపై పట్టు సంపాదించే ప్రయత్నం చేశా. నేను తియ్యగలను నమ్మకం ఏర్పడ్డాకే.. దర్శకురాలిగా తెరపైకి అడుగుపెట్టా.