తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Love Story Movie: 'ఆయన స్వేచ్ఛ వల్లే ఇది సాధ్యమైంది' - సంగీత దర్శకుడు పవన్

'లవ్​స్టోరీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్(Love Story Pawan Ch). ఏఆర్ రెహమాన్ దగ్గర పనిచేసిన ఈయన.. తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అయితే.. దర్శకుడు శేఖర్‌ కమ్ముల(Sekhar Kammula Movies List) చిత్రానికి పనిచేయాలనే ప్రయత్నంలో భాగంగా 'ఫిదా'కి ఆడిషన్‌ ఇచ్చినప్పటికీ తొలుత ఆయనకు అవకాశం రాలేదని తెలిపారు. ఈనెల 24న 'లవ్​స్టోరీ'(Love Story Movie Release Date) విడుదల కానున్న నేపథ్యంలో పవన్​.. తన ప్రయాణానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

love story
లవ్​ స్టోరీ

By

Published : Sep 22, 2021, 5:27 AM IST

'సారంగ దరియా’, 'హే పిల్లా', 'నీ చిత్రం చూసి' తదితర గీతాలతో శ్రోతల్ని ఓలలాడిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు పవన్‌ సి.హెచ్‌(Love Story Pawan Ch). ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్‌. రెహమాన్‌ దగ్గర పనిచేసిన ఈయన 'లవ్‌స్టోరి'(Love Story Movie Release Date) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల రూపొందించిన చిత్రమిది. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా సంగీత పవన్‌ మీడియాతో ముచ్చటించారు. తన సంగీత ప్రయాణం గురించి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

సంగీతంపై ఆసక్తి అలా మొదలైంది..

చిన్నప్పటి నుంచి సినిమాల్ని విపరీతంగా చూసేవాడ్ని. మా తాత, నాన్న ఇద్దరూ సినిమాటోగ్రాఫర్లు. అయినా నాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉండేది కాదు. హైదరాబాద్‌లో నాకున్న స్నేహితులంతా సంగీత నేపథ్యం ఉన్నవారే. వారితో అప్పుడప్పుడు స్టూడియోలకి వెళ్తుండేవాడ్ని. ఓ పాటకి సంగీతం ఎలా సమకూరుస్తారు? దాన్ని ఎలా రికార్డు చేస్తారు? అని తెలుసుకునే ప్రయత్నంలో సంగీతంపై ఆసక్తి పెరిగింది. సాంకేతికంగా అంతగా ఏం తెలియకపోయినా ఓ ర్యాప్‌ సాంగ్‌ రూపొందించి, కుటుంబ సభ్యులకి వినిపించాను. బాగుందని చెప్పి, నన్ను ప్రోత్సహించారు. రెండు సంవత్సరాలు ఇక్కడే కీ బోర్డు నేర్చుకుని, ఆ తర్వాత కె. ఎం. మ్యూజిక్‌ (చెన్నై) లో చేరాను. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. ఓసారి 'గాలా నైట్‌' కార్యక్రమం కోసం కొన్ని పాటల్ని కంపోజ్‌ చేశా. అక్కడికి అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్‌కి నా మ్యూజిక్ నచ్చడంతో ఆయన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చారు. ఆయన సంగీతం అందించిన 'సచిన్‌', 'సర్కార్‌', 'రోబో' తదితర చిత్రాలకి పనిచేశా.

లవ్​ స్టోరీ సంగీత దర్శకుడు పవన్

పరీక్షించారు..

దర్శకుడు శేఖర్‌ కమ్ముల(Sekhar Kammula Movies List) చిత్రానికి పనిచేయాలనే ప్రయత్నంలో భాగంగా 'ఫిదా'కి ఆడిషన్‌ ఇచ్చా. ఓ ట్యూన్‌ నచ్చినా, నేను కొత్తవాడ్ని కావడంతో తిరస్కరించారు. ఆయన అంత త్వరగా అవకాశం ఇవ్వరనే సంగతి తెలిసిందే. అలా మరో ప్రయత్నం చేశా. రెహమాన్‌ దగ్గర పనిచేస్తున్నప్పుడు 'హే పిల్లా' అనే పాటకి సంబంధించిన డెమోని శేఖర్‌కి పంపించాను. అది విని చాలా బాగుందన్నారు. కానీ, వెంటనే ఓకే చేయలేదు. ఈ ట్యూన్‌ చేయడానికి ఎంత సమయం పట్టింది? అలా చేయ్‌... ఇలా చేయ్‌ అంటూ నన్ను పరీక్షించారు. నా మైండ్‌సెట్‌ ఎలా ఉందో తెలుసుకున్నారు. దాన్ని సవాలుగా స్వీకరించా. సుమారు 10 ట్యూన్లు వినిపించా. నా పనితీరు నచ్చడంతో 'లవ్‌స్టోరి' కథ చెప్పారు. సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఆయనతో సాగిన ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.

అలా.. 'సారంగ దరియా'

జానపద గీతం 'సారంగ దరియా'ని(Saranga Dariya) నాకు ఓసారి చూపించారు. కానీ, సినిమాలో పెట్టాలని ముందుగా చెప్పలేదు. తర్వాతి చర్చల్లో దీన్ని మనం రీ క్రియేట్‌ చేయాలన్నారు. అది ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. అయితే ఈ పాటపై వచ్చిన వివాదం గురించి నాకు తెలియదు. నేను ఆ సమయంలో ఈ సినిమా నేపథ్య సంగీతం పనుల్లో చెన్నైలో బిజీగా ఉన్నాను. రొమాంటిక్ కామెడీ చిత్రాలకైతే నేపథ్య సంగీతం ఇవ్వడం తేలికే. కానీ, ఇలాంటి సున్నితమైన ప్రేమకథలకి ఇవ్వడం కొంచెం కష్టమైన పని. ఈ ఆల్బమ్‌ విన్న రెహమాన్‌ నేను బాగా చేశానని నా స్నేహితులతో చెప్పారట. 'హేయ్‌ పిల్లా' పాట వినగానే చాలా బాగుందంటూ నాగ చైతన్య నాకు మెసేజ్‌ చేశారు. అది ఎప్పటికీ మరిచిపోలేను.

శేఖర్‌ కమ్ములే కారణం..

ఈ చిత్రంలో అన్ని పాటలూ హిట్‌ అవడానికి కారణం శేఖర్‌ కమ్ములనే. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఇది సాధ్యమైంది. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నా. ఇంకా ఖరారు చేయలేదు. అంతర్జాతీయ స్థాయిలో ప్రైవేటు ఆల్బమ్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నాను.

ఇదీ చదవండి:'ఆ ఘటనకూ 'లవ్​స్టోరి'కి సంబంధం లేదు'

ABOUT THE AUTHOR

...view details