తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ నటుడు.. విలన్ పాత్రలకు డిక్షనరీ!

ప్రతివారం ప్రముఖ నటీనటుల గురించి ఆసక్తికర విషయాలతో ముందుకొచ్చే 'ఈటీవీ భారత్'.. ఈ ఆదివారం మరో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు జీవితాన్ని మీ ముందు ఉంచుతుంది. ఎన్నో అద్భుత పాత్రల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కోట శ్రీనివాస్. విలనీలో సునామీ సృష్టించారు కోట. తొలుత అతడి ఉద్యోగం.. బ్యాంకులో లక్షలు లెక్కబెట్టే పని. మరి తర్వాత!! అదే కోట సినీలోకంలో తన ఖాతాకు చేరిన కోట్లాది అభిమానులను లెక్కిస్తున్నారు. వెండితెరపై గత నలభై ఐదేళ్లుగా అతడికి అదే పని. తెలుగు చిత్రసీమలో విలన్ ఫార్ములా రేస్‌లో ఎందరెందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. తుదకు గెలిచిందీ, నిలిచిందీ కోట శ్రీనివాసరావే.

kota srinivasa rao special story
కోట శ్రీనివాసరావు

By

Published : Jul 18, 2021, 9:51 AM IST

Updated : Jul 18, 2021, 11:03 AM IST

అచ్చంగా ప్రతినాయకుడు కాదు. ప్రేక్షక జననాయకుడు. కచ్చితమైన టైమింగ్‌తో.. పంచ్ డైలాగులతో మనసులు గెలిచిన ప్రతినాయక అధినాయకుడు. కోట శ్రీనివాసరావు వెండితెర విలనీకి వికట్టహాసం, విలన్ పాత్రల ఇతిహాసం. హాస్యనటనలో నిత్యదరహాసం. వందల సినిమాల తెరవేల్పు.. కోట. ఆయన మాటలు డైనమైట్లలా పేలాయి. పీఠాలు కదిలించి కోటలు దాటాయి. ఆయన ధాటికి సంప్రదాయ విలనీ కోటగుమ్మం ముందు తలవేలాడేసింది.

కోట శ్రీనివాసరావు

మద్రాసు ప్రెసిడెన్సీలోని బెజవాడ. ఆ సమీపంలో కంకిపాడు. అక్కడ డాక్టర్ కోట సీతారామాంజనేయులు తనయుడు.. నవ యువకుడు కోట శ్రీనివాసరావు. డిగ్రీ అయ్యాక ..భాగ్యనగరంలోని నారాయణగూడ స్టేట్ బ్యాంకులో అతడికి ఉద్యోగం వచ్చింది. కానీ నాటకానుభవంతో మనసంతా కళావేదికల మీద విహరించేది. తరచూ నాటికలో, నాటక ప్రదర్శనల్లోనో అవకాశాలు వచ్చాయి. రంగస్థలం కాదు.. కుంభస్థలమే కొట్టాలని సినీలోకంలో చేరాలని చిన్నిచిన్ని ఆశ. ఆశనే ఆశయంగా మారింది. రవీంద్రభారతి వేదికపై నాటకంలో నటించి దర్శకుడు క్రాంతికుమార్ దృష్టికొచ్చారు. 'ప్రాణం ఖరీదు' సినిమాతో సినీలోకానికి వచ్చిపడ్డారు. అభ్యుదయ దర్శకుడు టి. కృష్ణ తీసిన 'రేపటి పౌరులు' సినిమాతో గుర్తింపు వచ్చింది.

తరువాత వరుస అవకాశాలతో మెప్పించారు. విలనీలో సునామీ సృష్టించారు కోట శ్రీనివాసరావు. తొలుత అతడి ఉద్యోగం.. బ్యాంకులో లక్షలు లెక్కబెట్టే పని. మరి తర్వాత!! అదే కోట సినీలోకంలో తన ఖాతాకు చేరిన కోట్లాది అభిమానులను లెక్కిస్తున్నారు. వెండితెరపై గత నలభై ఐదేళ్లుగా అతడికి అదే పని. తెలుగు చిత్రసీమలో విలన్ ఫార్ములా రేస్‌లో ఎందరెందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. తుదకు గెలిచిందీ, నిలిచిందీ కోట శ్రీనివాసరావే. రామోజీరావు నిర్మించిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రం 'ప్రతిఘటన' కోట శ్రీనివాసరావు సినీ జీవితంలో ఓ మేలుమలుపు. చైతన్య నగారా మోగించిన ఆ సినిమాలో ఆయన నటన అద్భుతం.

కోట శ్రీనివాసరావు
  • 'తమ్మీ నేను మినిస్టర్ కాశయ్యను మాట్లాడతాండ' అంటూ తెలంగాణ నుడికారాన్ని సొగసుగా పలికించారు. ఆ అభినయం, సంభాషణా విధానం, హావభావాలు, సినీపరిశ్రమను ఆకర్షించాయి. ఇక వరుసగా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. 'అహనా పెళ్లంట'లో పీనాసి లక్ష్మీపతి పాత్ర ఎవర్ గ్రీన్. బతికున్న కోడిని వేలాడదీసి తినేంత పిసినారితనం. ఊహించుకోవటానికీ పరాకాష్ట. బస్టాండులో టీ అమ్ముతూ బావమరిదికి పిచ్చెక్కించినా. కామెడీలో జనానికి కిక్కెక్కించినా అతడికి అతడే సాటి.

హీరో అంటే శౌర్యం. విలన్ అంటే క్రౌర్యం. వెండితెరపై అనాదిగా శౌర్యానికీ, క్రౌర్యానికీ యుద్ధం జరుగుతూనే ఉంది. ఎస్వీ రంగారావు, రాజనాల, నాగభూషణం, సత్యనారాయణ, రావు గోపాలరావు లాంటి ఎందరో మహానటులు ప్రతినాయక పాత్రలకు వన్నెతెచ్చారు. ఏకఛత్ర విలన్లుగా ఏలారు. ఏకచిత్ర విలన్లు రాణించినా మళ్లీ కనపడలేదు. తర్వాత కాలంలో కోట శ్రీనివాసరావు విలన్ పాత్రలలో ఒదిగారు. శిఖరమంత ఎదిగారు.

  • 'ప్రతిఘటన' సినిమాలో గుడిసెల కాశయ్యగా వచ్చి అనతి కాలంలోనే అందరివాడై ప్రేక్షకుల గుండెల్లో గుడికట్టుకున్నాడు. అగ్రహీరోగా ఎదుగుతున్న చిరంజీవి తన సినిమా ఖైదీ నెంబర్ 786లో విలన్ పాత్ర కోట శ్రీనివాసరావే చేయాలని పట్టుబట్టారు. కొన్ని గంటలపాటు ఓపిగ్గా నిరీక్షించి అవకాశమిచ్చారు.
  • కోట శ్రీనివాసరావు విలన్ పాత్రలకు అల్టిమేట్ అని చెప్పాల్సిన చిత్రం సినిమా గణేశ్. హై ఓల్టేజీ విలనిజానికి మరో పేరు కోట. ప్రజల రక్తాన్ని జలగలా పీల్చే ఆరోగ్యమంత్రి సాంబశివుడుగా కోట నటన పతాక స్థాయిలో ఉంది. ఎంతో క్రూరుడు, ఒళ్లు జలదరించే రూపం. ఒంటికంటి రాక్షసునిలా భేతాళ మాంత్రికునిలా.. అరివీర భయంకర రూపంలో చెలరేగారు.

భాష ఒక్కటే. యాసలెన్నో. వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు మాండలికాలు సహజం. కోట అలవోకగా మాండలికాలు ఒడిసిపట్టి.. కొట్టిన డైలాగులు ప్రేక్షకజనం నీరాజనాలు పలికారు. వినోదమైనా, విషాదమైనా.. ఏ పాత్రలలో అయినా లీనమై నటించటం కోట ప్రత్యేకత.

  • బాబు మోహన్, కోట జోడీకి విపరీతమైన క్రేజ్. వాళ్లిద్దరూ నటిస్తున్నారంటే సినిమా సక్సెస్ అని నిర్మాతలకు ఓ నమ్మకం ఏర్పడింది. సినిమాలో తాము కోరుకున్నది దొరికిందని ప్రేక్షకులకూ ఒక విశ్వాసం కలిగింది.

అటు విలనీ, ఇటు కామెడీనీ బొమ్మా-బొరుసుగా కోట శ్రీనివాసరావు చిత్తాట ఆడేశారు. ఆ తర్వాత గాయకుడిగాను కొన్ని పాటలు పాడారు. దీంతో పాటు అనేక ఉదాత్త పాత్రల్లో నటించి బహుపాత్రధారిగా నిరూపించుకున్నారు.

  • మాటలిచ్చిన దర్శకులే కోట శ్రీనివాసరావుకు పాటలు కూడా ఇచ్చారు. 1993లో విడుదలైన 'మనీ'లో కోటకు పాట పెట్టారు. పాడింది ఆయన కాదు. సంగీతదర్శకుడు శ్రీ.. తన తండ్రి ఒకనాటి దిగ్గజ స్వరకర్త చక్రవర్తితో పాడించిన 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు' పాట యువతను ఆకట్టుకుంది. అచ్చం కోట పాడినట్లే ఆవహించినట్లు గానం చేశారు.

పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్'లో 'మందుబాబులం.. మేము మందు బాబులం' పాట పాడారు. అప్పటికప్పుడు అనుకోని ఈ పాటపు కంపోజ్ చేశారు. కానీ చాలాకాలం పాటు మందుబాబులకు కిక్ ఇచ్చింది

  • ఒక్క విలన్ గానే కాదు. తండ్రి వేషాలలోనూ నటించి భావోద్వేగాలు పండించారు కోట శ్రీనివాసరావు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమాలో 'అవసానదశలో తండ్రికి అన్నం పెట్టేవాడే కొడుకు' అంటూ ఆయ చెప్పిన మన మనసుల్ని కదిలిస్తాయి.

పూర్ విలనీలు పోయాయి. క్రూర విలనీలు వచ్చాయి. స్కూలే మారింది. ఏ క్యారెక్టరయినా ఒక ప్రత్యేక బాడీ లాంగ్వేజ్. ఒక మేనరిజం ఆయన ప్రత్యేకత. కోట వెండితెర పై ఎన్నో.. ఎన్నెన్నో మరపురాని చిత్రాల్లో నటించారు. కోట లాంటి నటుడు, నటప్రతిభాశాలి నూటికి, కోటికి ఒక్కరూ ఉంటారు. 4 దశాబ్దాలలో 750కి పైగా సినిమాల్లో నటించారంటే అది కోట ఒక్కడికే సాధ్యం. పరిశ్రమ అయినా, ప్రేక్షక ప్రపంచమైనా నమ్మింది అదే కాబట్టి. ప్రతినాయక పాత్రలకు అతడు ఆధునిక నిఘంటువు కోట శ్రీనివాసరావు.

మధ్యతరగతి వినోదంలో ఆయనే మూలపాత్రధారి! కోట పేరు వినగానే మన ఇంట్లో మనిషిలానే కని పిస్తారు. సమాజంలో నిత్యం ఎదురయ్యే మనిషి స్వభావాలకు తెరపై ప్రాణంపోసిన నటుడు. పేదింటి బాబాయ్‌, కరుడు గట్టిన మావయ్య, స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు, మాయల మరాఠీ మాంత్రికుడు, పిసినిగొట్టు, అందరి బాగూ కోరే ఓ పెద్దమనిషి, ఆదరించే తాతయ్య, అందరికీ నచ్చిన ఇంటి పెద్ద.. ఇలా పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగి పోయారు కోట. 40 ఏళ్ల సినీ కెరీర్‌ను నల్లేరు మీద బండిలా నడిపించేశారు. అందుకే తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని కోటను నిర్మించుకున్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ నుంచి పురస్కారం అందుకుంటున్న కోట శ్రీనివాసరావు

ఇవీ చదవండి:

Last Updated : Jul 18, 2021, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details