సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన 'ఒక్కడు'లో... కర్నూల్లో హీరోయిజం చూపించేందుకు అక్కడ ఫేమస్ అయిన కొండారెడ్డి బురుజును చూపించారు. అప్పట్నుంచి కర్నూలు నేపథ్యంలో వస్తున్న సినిమాల్లో ఈ బురుజు చిరునామాగా నిలిచింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఈ బురుజు కనువిందు చేస్తోంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్‌ని తీర్చిదిద్దారు. దాదాపు రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. 14 రీల్స్ నిర్మిస్తోంది. దానికి సంబంధించిన విశేషాలను కళా దర్శకుడు ప్రకాష్ వివరించారు.
" సినిమాలో కొండారెడ్డి బురుజు నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాలి. అందుకోసం ఆ లొకేషన్‌ను పరిశీలించడానికి కర్నూలు వెళ్లాం. మునుపటికన్నా అక్కడ రద్దీ పెరిగిపోయింది. అలాంటి చోట మహేష్‌బాబు లాంటి హీరోతో షూటింగ్ అంటే చాలా కష్టం. జనాన్ని అదుపు చేయలేం. 20 రోజుల పాటు అక్కడే ఉండి షూటింగ్ చేయాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర చిత్రబృందం వందల్లో ఉంటారు. వీళ్లందరినీ వెంటబెట్టుకుని షూటింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే.. అదే సెట్‌ని రామోజీ ఫిలింసిటీలో వేయాలని నిర్ణయించుకున్నాం"
-- ప్రకాష్, కళా దర్శకుడు