హిమానీ బుందేలా కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్-13(KBC season 13)లో కోటి రూపాయలు గెల్చుకున్న తొలి పోటీదారుగా నిల్చింది. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా. తండ్రి విజయ్ సింహ్ చిరు వ్యాపారి. తల్లి సరోజ్ గృహిణి. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. ఇంటర్‌లో ట్యూషన్‌కి వెళుతుండగా బైక్ ఆమెను ఢీకొంది. కాళ్లూ చేతులకు బాగా దెబ్బలు తగిలాయి. ఎముకలేమీ విరగలేదు. దీంతో డాక్టర్ దెబ్బలకు కట్లు కట్టి పంపించేశారు. కొన్నిరోజులకు ఆమె తన కళ్లు బాగా మసకబారుతుండటం గమనించింది. హాస్పిటల్‌కి వెళితే ‘రెటీనా పక్కకు తొలిగింది, రెండు రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే చూపు పోయే ప్రమాదం ఉంద’న్నారు. ఎనిమిది నెలల్లో నాలుగు ఆపరేషన్లు జరిగాయి. మూడో సర్జరీ వరకూ రంగులు సహా స్పష్టంగా చూడగలిగేది. నాలుగో ఆపరేషన్ నుంచి పూర్తిగా చూడలేకపోయింది. ఇప్పటికీ వెలుతురు, చీకటి మినహా ఏమీ గుర్తుపట్టలేదు.
కానీ..తనేమీ కుంగిపోలేదు. లెక్కలంటే ఇష్టం. వాటినే సాధన చేసేది. చిన్నతరగతుల పిల్లలకు మెంటల్ మ్యాథ్స్ బోధిస్తోంది. ఆగ్రాలోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా చేస్తోంది. కేబీసీ మీద ఉన్న ఆసక్తితో ప్రయత్నించింది.