జేమ్స్ కామెరూన్ దర్శక-నిర్మాణంలో తెరకెక్కతున్న ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'అవతార్ 2'. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను నీటిలోనే చిత్రీకరించారు. ఇందులో 'టైటానిక్' కథానాయిక కేట్ విన్స్లెట్ 'రోనల్' అనే పాత్రలో నటిస్తోంది. కథలో ఆమెది చాలా కీలకమైన పాత్ర. ఈ సినిమా కోసం ఆమె డైవింగ్ నేర్చుకుందట. కేట్పై ఏడు నిమిషాల పాటు అండర్ వాటర్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమె భర్త నెడ్ రాక్‌ర్నోల్ చాలా సహాయపడ్డారట.
తాజాగా ఆమె 'అవతార్2' చిత్రంలోని అండర్ వాటర్‌లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ... "నీటి అడుగు భాగాన చిత్రీకరణ జరుపుతున్న సమయంలో నా ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయింది. ఓ దశలో నేను చనిపోయానేమో అనుకున్నా. నీటిలో ఉండి ఊపిరి బిగబట్టే విషయంలో మా ఆయన నెడ్ నాకెంతో సహాయపడ్డారు" అని వెల్లడించింది.