అందం, అభినయంతో పాటు డ్యాన్సర్‌గానూ చిత్రసీమలో ఖ్యాతి దక్కించుకున్న సొగసుల తార కరిష్మా కపూర్. 90వ దశకంలో బాలీవుడ్ సినీప్రియుల మదిలో కలల రాణిగా చెరగని ముద్ర వేసింది. ఇంతవరకు అనేక హిట్ గీతాల్లో నటించినా ఆమెకు మాత్రం ‘కృష్ణ’ చిత్రంలోని "ఝాంఝరియా" పాటంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఇటీవలే జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో ఈ పాట వెనుకున్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
"ఝాంఝరియా' పాటను హీరోయిన్, హీరో వెర్షన్‌లో చిత్రీకరించారు. నాకు సంబంధించిన భాగాన్ని మూడు రోజుల పాటు ముంబయిలో తీశారు. ఆ తర్వాత ఎడారిలో షూటింగ్ చేసే సమయంలో ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా అనిపించేది. ఓ వైపు విపరీతమైన వేడి గాలి, మరోవైపు ఇసుక రేణువులు కళ్లలో పడుతుండటం వల్ల బాధగా అనిపించేది. అలాంటి క్లిష్ట సమయంలోనూ పాటను చిత్రీకరించాం. ఈ గీతం కోసం దాదాపు 50 డిగ్రీల ఎండలో 30సార్లు దుస్తులు మార్చుకోవలసి వచ్చింది. అంతటి ప్రతికూల వాతావరణంలో జరిగిన షూటింగ్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. నా కెరీర్‌లో ఎన్ని పాటలున్నా ‘ఝాంఝరియా’ అంటే నాకెంతో ప్రత్యేకం" -కరిష్మా కపూర్, నటి