తన ఇంట్లో ఇద్దరు పనివారికి కరోనా సోకిందని బాలీవుడ్ సినీనిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. తనతో సహా కుటుంబసభ్యులు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా, నెగటివ్ వచ్చిందని తెలిపారు. అయినా 14 రోజులపాటు హోం క్వారంటైన్లో గడపనున్నామని చెప్పారు.
"నా ఇంటి పనిమనుషుల్లో ఇద్దరికి కరోనా సోకింది. వారిలో వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాత మా బిల్డింగ్‌లోనే ఉంచి.. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ వారికి సమాచారం అందించాం. నిబంధనల ప్రకారం వారు వచ్చి బిల్డింగ్‌ను శానిటైజేషన్ చేశారు. వారు చేసిన పరీక్షలో మిగిలిన వారిపై వైరస్ ప్రభావం కనిపించలేదు. అయినా ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కోసం మేమంతా 14 రోజులపాటు స్వీయనిర్బంధం పాటిస్తాం. అధికారుల ఆదేశాలకు కట్టుబడి ఉంటాం. మహమ్మారి బారిన పడిన వారిద్దరికి త్వరలోనే నయం అవుతుందని ఆశిస్తున్నా". - కరణ్ జోహార్, బాలీవుడ్ నిర్మాత