చిత్రం: తలైవి(Thalaivi review)
నటీనటులు: కంగన రనౌత్, అరవింద్ స్వామి, సముద్రఖని, భాగ్యశ్రీ, మధుబాల, పూర్ణ, నాజర్ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్
ఛాయాగ్రహణం: విశాల్ విట్టల్
కూర్పు: ఆంటోనీ
నిర్మాతలు: విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్.ఆర్ సింగ్
దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్
విడుదల: 10-09-2021
శక్తిమంతమైన మహిళా పాత్రలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది కంగన రనౌత్(Kangana Ranaut Thalaivi movie review). వరుసగా నాయికా ప్రాధాన్యమున్న కథల్ని చేస్తూ బాక్సాఫీసుపై తనదైన ప్రభావం చూపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రని కంగన భుజానికెత్తుకోవడం అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తించింది. 'తలైవి'(Thalaivi movie rating) పేరుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కథ రూపొందింది. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. విడుదలకి ముందే చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? జయలలితగా కంగన, ఎంజీఆర్‌గా అరవింద స్వామి ఏ మేరకు మెప్పించారు? ఎంతో విస్తృతమైన జయలలిత(Jayalalitha Thalaive movie) జీవితగాథను ఏఎల్ విజయ్ ఎలా ఆవిష్కరించారో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha movie) సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె ముఖ్యమంత్రిగా పదివిని చేపట్టేవరకు సాగే కథ ఇది. పదహారేళ్ల వయసులో జయ (కంగన రనౌత్) సినీ రంగ ప్రవేశం చేస్తుంది. ఇష్టం లేకపోయినా ఆమె కెమెరా ముందుకు అడుగు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత స్టార్‌గా ఎదుగుతుంది. ఆమె తెర ప్రవేశం చేసేనాటికే పెద్ద స్టార్‌గా.. ఆరాధ్య కథానాయకుడిగా ప్రేక్షకుల మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించిన ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి)తో ఆమెకి ఎలా అనుబంధం ఏర్పడింది? ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఎంజీ రామచంద్రన్ ఎలా కారణమయ్యారు? తన గురువుగా భావించే ఆయన మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఎలాంటివి? జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేపట్టే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తదితర విషయాలతో సినిమా సాగుతుంది.
ఎలా ఉందంటే?
ప్రతిపక్ష నాయకురాలిగా జయ అసెంబ్లీలో చేసే ప్రసంగం... ఆ తర్వాత ఆమెకి ఎదురైన అనుభవాలతో సినిమా కథని మొదలు పెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు దర్శకుడు. ఆ వెంటనే ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లి జయ సినీ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఎంజీఆర్ సినిమాలో ఆమె అవకాశం సంపాదించడం ఆ తర్వాత వాళ్లిద్దరిదీ హిట్ కాంబినేషన్ కావడం వంటి సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఒక పక్క ఎంజీఆర్ స్టార్ స్టేటస్‌నీ, ఆయన రాజకీయాలపై చూపిస్తున్న ప్రభావాన్ని హైలైట్ చేస్తూనే జయ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. జయ-ఎంజీఆర్ మధ్య బంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు కూడా మెప్పిస్తుంది. వాళ్లిద్దరి మధ్య బంధం ఏమిటనే విషయంలో ఎక్కడా తూకం చెడకుండా సున్నితంగా ఆవిష్కరించారు.
వాళ్లిద్దరిదీ గురు శిష్యుల బంధమే అని కథలో చెప్పించినా.. గాఢమైన ప్రేమకథ స్థాయి భావోద్వేగాలు పండాయి. అదే ఈ సినిమా ప్రత్యేకత, అదే ఈ సినిమాకి ప్రధానబలం. సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య రాజకీయం దూరం పెంచడం, ఆ తర్వాత అదే రాజకీయం కోసం ఇద్దరూ కలవడం వంటి డ్రామా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంఘటనల రూపంలోనే కథని చెప్పినా.. డ్రామా, భావోద్వేగాలు బలంగా పండాయి. ద్వితీయార్ధం కథ మొత్తం రాజకీయం చుట్టూనే సాగుతుంది. జయ రాజ్యసభకి వెళ్లడం, ఇందిరాగాంధీని కలవడం, ఎంజీఆర్‌కి అనారోగ్యం, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. అమ్ము అని ముద్దుగా పిలిపించుకునే ఓ అమ్మాయి.. అందరితో అమ్మ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిన తీరుని ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి.
తలైవి సినిమాలో ఓ సన్నివేశం ఎవరెలా చేశారంటే?
జయలలిత పాత్రలో కంగన ఒదిగిపోయారు. సినీ కెరీర్ ఆరంభంలో జయ కనిపించిన విధానం మొదలుకొని.. ఆమె రాజకీయాల్లోకి వచ్చాక మారిన క్రమం వరకు కంగన తనని తాను శారీరకంగా మార్చుకుంటూ నటించారు. ఎంజీఆర్‌తో బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాల్ని పలికించారు. జయలలిత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని నటించిన ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి కూడా జీవించారు. నటుడిగానూ... రాజకీయ నాయకుడిగానూ ప్రత్యేకమైన హావభావాలు పలికిస్తూ నటించారు. కంగన, అరవింద్ స్వామి ఎంపిక పర్‌ఫెక్ట్ అని ఆ ఇద్దరి పాత్రలు చాటి చెబుతాయి. జయ తల్లిగా భాగ్యశ్రీ, ఎంజీఆర్ భార్యగా మధుబాల పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. కరుణ పాత్రలో నాజర్ కనిపిస్తారు. ఎంజీఆర్ కుడిభుజంగా సముద్రఖని పోషించిన పాత్ర కూడా కీలకమైనదే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జీవి సంగీతం, విశాల్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయేంద్రప్రసాద్, విజయ్ రచన మెప్పిస్తుంది. దర్శకుడిగా విజయ్ తనదైన ప్రభావం చూపించారు. భావోద్వేగాలతో పాటు... జయలలిత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన విధానంలో దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. నిర్మాణంలో నాణ్యత కనిపిస్తుంది.
బలాలు
- కంగన.. అరవింద్ స్వామి నటన
- భావోద్వేగాలు
- ద్వితీయార్ధంలో రాజకీయ నేపథ్యం
బలహీనతలు
- జయలలిత జీవితం కొంతవరకే చూపించడం
చివరిగా: 'తలైవి' యాక్టర్ టూ సీఎం జయలలిత కథ మెప్పిస్తుంది!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి:kangana ranaut: 'ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తా'