బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముంబయిలో భద్రతపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. మళ్లీ ముంబయి రావొద్దంటూ కొందరు శివసేన నేతలు ఆమెను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ముంబయికి వస్తున్నట్లు కంగన ప్రకటించింది. వీలైతే తనను రాకుండా అడ్డుకోవాలని శివసేనకు సవాల్ విసిరింది. తాను వచ్చే సమయం కూడా చెప్తానని పేర్కొంది. ఇప్పుడు మరో ట్వీట్‌తో విరుచుకుపడింది కంగన.. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లే అధికారం, భావాలను వ్యక్తీకరించే హక్కు తనకున్నాయని తెలిపింది. తాను స్వతంత్రురాలినంటూ వీడియో షేర్ చేసింది.
'దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుంది' - కంగన వార్తలు
కంగనా రనౌత్, శివసేన నేతల మధ్య చెలరేగిన 'ముంబయి' వివాదం.. తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ విషయంపై ట్విట్టర్లో స్పందించిన కంగన.. దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకుందని పేర్కొంది.
కంగన
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన ప్రశ్నలు సంధించింది. బాలీవుడ్‌లో వారసులు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించింది. సుశాంత్ మృతిపై జరుగుతున్న విచారణపై సామాజిక మాధ్యమాల వేదికగా.. కంగన పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని కంగన ఆరోపించింది.
Last Updated : Sep 6, 2020, 6:50 PM IST