'అ!' వంటి ప్రయోగాత్మక కథ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ నుంచి వస్తోన్న మరో వైవిధ్యభరిత చిత్రం 'కల్కి'’. రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా అదా శర్మ నటిస్తోంది. రాహుల్ రామకృష్ణ, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
"ఆకాశవాణి.. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి’" అన్న సంభాషణలతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. ఈ హత్య గురించి తెలుసుకున్న జర్నలిస్టు (రాహుల్ రామకృష్ణ)... "శేఖర్ బాబును ఎవరు చంపారు?" అంటూ ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తుంటాడు. "ఈ హత్యపై విచారణ మొదలుపెడదాం" అని పోలీస్ ఆఫీసర్‌గా రాజశేఖర్ రంగంలోకి దిగడం, ఈ కేసును ఛేదించే క్రమంలో ఆయనకు ఎదురైన అడ్డంకులు, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్‌ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు.