రాజశేఖర్, అదా శర్మ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు బీ, సీ సెంటర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ మూవీలోని ఓ సన్నివేశానికి సంబంధించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఈ చిత్రంలోని ఒక సీన్‌లో రాజశేఖర్ థియేటర్లో కూర్చొని 'సాగర సంగమం' సినిమా చూస్తుండగా.. ఆయన్ను వెతుక్కుంటూ రాహుల్ రామకృష్ణ అక్కడకు వస్తాడు. ఆ సమయానికి తెరపై 'తకిట తథిమి' పాట వస్తుంటుంది. వాస్తవానికి మొదట ఈ సీన్ తీసినప్పుడు తెరపైన 'ఖైదీ'లోని కీలకమైన చిరంజీవి సీన్‌ను ప్లే చేశారట. అంతేకాదు.. ఆ సన్నివేశం చూస్తూ రాజశేఖర్ "ఎవరీ కుర్రాడు బాగా చేస్తున్నాడు.. భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడు" అని ఓ డైలాగ్ కూడా చెప్తాడట.