కైకాల సత్యనారాయణ..తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్లకు పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు..నటుడిగా గత ఏడాదికే షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద విడుదల అయితే, 1935, జులై 25న సత్యనారాయణ జన్మించారు.1959లో ఆయన నటించిన చిత్రం 'సిపాయి కూతురు' విడుదలయింది. ఆ విధంగా నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి.. 61సంవత్సరాల పాటు అనేక పాత్రలు పోషించి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా అభిమానులందరికీ సత్యనారాయణ జీవిత చరిత్ర, సినిమా విశేషాలు తెలిసినవే.. అయినప్పటికీ.. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరొకసారి సింహావలోకనం చేసుకుందాం.
పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు
హీరోగా సినిమా రంగానికి పరిచయం అయినా.. ఆ సినిమా నిరాశపర్చడం వల్ల విలన్గా మారడానికి తటపటాయించలేదు. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాల్లో సత్యనారాయణ విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత సోషల్ పిక్చర్స్ లో కూడా విలన్గా అవతారమెత్తారు. సత్యనారాయణ నవ్వు పాపులర్ విలనీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిదశలోనే ఆయనకు పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది. 'లవకుశ'లో భరతుడిగా.. 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో కర్ణుడిగా.. 'నర్తనశాల'లో దుశ్శాసనుడిగా నటించారు. 'శ్రీకృష్ణపాండవీయం'లో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్లీ 1995లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘటోత్కచుడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. 'శ్రీకృష్ణావతారం' చిత్రంలో తొలిసారి దుర్యోధనుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత 'కురుక్షేత్రం'లో దుర్యోధనుడిగా అద్భుతంగా రక్తి కట్టించారు. అలాగే రావణాసురుడిగా 'సీతాకళ్యాణం'లో..భీముడిగా 'దానవీరశూరకర్ణ'లో.. మూషికాసురుడిగా 'శ్రీ వినాయక విజయం' చిత్రాల్లో నటించారు.
యముడంటే గుర్తొచ్చేది కైకాల..
చాలా మందికి తెలియని విశేషమేమిటంటే కథానాయిక మొల్లలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించారు సత్యనారాయణ. యమధర్మరాజు అంటే తెలుగు తెరకి ఆయన తప్ప మరొకరు గుర్తురారు. 'యమగోల' సినిమాతో ప్రారంభమైన ఈ పాత్ర జైత్రయాత్ర 'యముడికి మొగుడు', 'యమలీల', 'రాధామాధవ్' 'దరువు' చిత్రాల వరకూ సాగింది. 'మోసగాళ్ళకు మోసగాడు', 'దొంగల వేట' మొదలైన సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేనివి. 'ఉమ్మడి కుటుంబం', 'దేవుడు చేసిన మనుషులు', 'శారద' చిత్రాలతో ఆయన ఇమేజ్ మారింది. సాత్వికమైన పాత్రలకు కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. 'తాత మనవడు', 'సంసారం', 'సాగరం', 'రామయ్య తండ్రి', 'జీవితమే ఒక నాటకరంగం', 'దేవుడే దిగివస్తే' మొదలైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి కుటుంబ ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు.