తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే 'జెర్సీ'

నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'జెర్సీ'. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాపై ఈటీవీ భారత్ అందిస్తున్న రివ్యూ మీకోసం.

జెర్సీ

By

Published : Apr 19, 2019, 2:51 PM IST

Updated : Apr 19, 2019, 3:01 PM IST

"ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు వరకు నన్ను జడ్జ్ చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను". జెర్సీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నాని మాటలివి. మరి నాని ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా లేదా జెర్సీ సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

ఇంతకీ కథేంటీ..?
1986 నాటి హైదరాబాద్ రంజీ క్రికెట్ ప్లేయర్ అర్జున్ (నాని) కథే.. జెర్సీ. అనాథైన అర్జున్ క్రికెటే ప్రాణంగా జీవిస్తుంటాడు. భారత జట్టులో చోటు సంపాదించాలనే లక్ష్యంతో మైదానంలో అత్యుత్తమ ఆటగాడిగా రాణిస్తుంటాడు. ఈ క్రమంలో సరా(శ్రద్ధా శ్రీనాథ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి క్రికెట్​ను వదిలేస్తాడు. పదేళ్ల తర్వాత కొడుకు కోరిక మేరకు మళ్లీ ఆట మొదలుపెడతాడు. 36 ఏళ్ల అర్జున్. 10 ఏళ్ల కిందట క్రికెట్ ఎందుకు వదులుకున్నాడు, ఆ తర్వాత ఏం జరిగిందనేది జెర్సీ కథ.

ఎలా ఉంది?
క్రికెట్ నేపథ్యంలో ఎన్నో కథలు వెండితెరపై పరుగులు తీసినా.. బాక్సాఫీసు బౌండరీలు తాకలేకపోయాయి. అయినా అదే క్రికెట్​ను కథా వస్తువుగా ఎంచుకొని కల్పిత కథతో అర్జున్ అనే క్రికెటర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాడు దర్శకుడు గౌతమ్. 1986 నాటి క్రికెట్ ప్రపంచాన్ని 2019లో ప్రేక్షకులకు పరిచయం చేసిన గౌతమ్.. 36 ఏళ్ల ఓ వ్యక్తి హైదరాబాద్ క్రికెట్ జట్టును ఎలా విజయతీరాలకు చేర్చాడో చక్కగా చూపించాడు.

ప్రథమార్థంలో మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి ఉద్యోగం లేని తండ్రిగా నాని పడే తపన, కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్యగా శ్రద్ద వేదనతో పాటు తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని బాగా అల్లుకున్నాడు. ద్వితీయార్థానికి వచ్చేసరికి కుటుంబ పరిస్థితులు, హీరోగా చూడాలన్న కొడుకు కోరిక మేరకు నాని రంజీ క్రికెటర్​గా ఎలా ఎదిగాడు, చివరకు తన ప్రయత్నంలో కొడుకు కోరికను ఎలా తీర్చాడనే కథాంశంతో జెర్సీ ముగుస్తుంది.

ఎవరెలా చేశారు?
క్రీడా నేపథ్యంగా నాని చేసిన రెండో చిత్రం ఇది. గతంలో 'భీమిలి కబడ్డీ జట్టు' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నేచురల్ స్టార్.. ఈసారి నిజమైన క్రికెటర్​గా మారి నటించిన చిత్రం 'జెర్సీ'. చిత్రానికి ప్రధాన బలం నాని. శ్రద్ధా శ్రీనాథ్ సరా పాత్రలో మధ్యతరగతి మహిళగా చక్కటి నటన ప్రదర్శించింది. కోచ్​గా సీనియర్ నటుడు సత్యరాజ్, నాని కొడుకుగా నటించిన బాలనటుడు రోనిత్ తన మాటలతో కట్టిపడేస్తారు.

ఈ కథకు కెప్టెనైన గౌతమ్ తిన్ననూరి... జట్టులోని ఆటగాళ్లలందరి చక్కటి ప్రదర్శనకు అవకాశమిచ్చి నిజమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. 'మళ్లీరావా' చిత్రంతో దర్శకుడిగా తొలిముద్ర వేసిన గౌతమ్.. 'జెర్సీ'తో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. "100లో గెలిచిన వాడి కంటే... ఆ వందలో ప్రయత్నిస్తూ ఓడిపోయిన 99 మంది కథే తన జెర్సీ" అని చెప్పిన విధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. జెర్సీ అని పేరు ఎందుకు పెట్టారో పతాక సన్నివేశాల్లో అర్జున్ కొడుకు నానితో చెప్పించిన తీరు మనసును తాకుతుంది.

సాంకేతికంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ సానూ పనితనం సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. అనిరుధ్ స్వరపర్చిన సంగీతం, కృష్ణకాంత్ అందించిన సాహిత్యం జెర్సీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. "కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం... ఓడొద్దు అంటే లేదు యుద్ధం...లేకుంటే కష్టం హాయి వ్యర్థం.. ఎవరి కోసం మారదు అర్థం" లాంటి పదాలతో కేకే అల్లిన పాటలు కథా బలాన్ని చాటుతాయి.

కొసమెరుపు :జెర్సీ... బాక్సాఫీసు బౌండరీని తాకింది

ఇవీ చూడండి.. విలన్​గా కనిపించనున్న నయనతార

Last Updated : Apr 19, 2019, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details