ఓ హీరో నటించాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్తుంటుంది. అలాగే ఓ సినిమా కోసం చేసిన ట్యూన్ మరో చిత్రంలో వినిపిస్తుంది. ఒక చిత్రానికి మంచి నేపథ్య సంగీతం (బి.జి.ఎం.) స్వరపరిచి దానినే ఆ సినిమాలోని ఏదైనా పాట కోసం వినియోగించడం సహజం. కానీ, కొన్ని సందర్భాల్లో అలా జరగదు. అందుకే విశేష ఆదరణ పొందిన బి.జి.ఎం.ను మరో చిత్రంలో ఎక్కడైనా వినియోగిస్తే బాగుంటుందని భావిస్తారు సంగీత దర్శకులు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఇలాంటి సందర్భాలున్నాయి. అదేంటో ఓ సారి చూద్దాం...
జేడీ చక్రవర్తి ట్యూన్ చిరుకి సెట్ అయింది
కొన్నిసార్లు వేరే ఏదో సినిమాలో వాడిన ట్యూన్‌నే మళ్లీ మరో చిత్రంలో ఉపయోగిస్తారు. అలాంటి పాటల్లో 'శంకర్‌దాదా ఎంబీబీఎస్'లోని 'బేగంపేట బుల్లమ్మో.. పంజాగుట్టా పిల్లమ్మో' కూడా ఒకటి. ఈ ట్యూన్‌ను డీఎస్పీ ముందుగా జేడీ చక్రవర్తి సినిమాలో ఉపయోగించాడు.
'బేగంపేట బుల్లమ్మో.. పంజాగుట్టా పిల్లమ్మో'.. చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' చిత్రంలోని ఈ పాట ఓ ఊపు ఊపింది. ఈ గీతం గుర్తురాగానే మ్యూజిక్ బీట్ నోటితోనే వాయించేస్తున్నారు కదూ! అంతగా ఈ ట్యూన్ శ్రోతల మదిలో నిలిచింది. సాహిత్యం, గానం ఎంతగా ఆకట్టుకున్నాయో.. డీఎస్పీ ట్యూన్‌కి చిరు వేసిన స్టెప్పులు అంతకు మించి అలరించాయి. మరి ట్యూన్ దేవీ ముందుగా ఏ సినిమా కోసం రూపొందించాడో తెలుసా?
జె.డి.చక్రవర్తి కథానాయకుడిగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం 'నవ్వుతూ బతకాలిరా'. ఇందులో చక్రవర్తి పరిచయ సన్నివేశం (ఇంట్రడక్షన్)లో వినిపిస్తుందీ ట్యూన్. 'అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానాం, పాలెం, రాజ...రాజ...రాజ..రాజమండ్రి' అనే డైలాగ్ చక్రవర్తి చెప్పేటపుడు నేపథ్యంలో వచ్చే ఈ బీట్ హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ సినిమాలోని పాటల్లో వినియోగించే అవకాశం లేకపోవడం వల్ల కొన్నేళ్ల తర్వాత జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన 'శంకర్‌దాదా ఎంబీబీఎస్'లో సెట్ చేశారు. అలా వచ్చిన ఈ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.