"నా పేరు తెలియకపోయినా అందరూ నన్ను ఏజెంట్ అని పిలుస్తున్నారు. ఆ ముద్ర పోగొట్టుకునేందుకు, మరో విభిన్న పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు వచ్చిందే ఈ 'జాతి రత్నాలు' కథ" అన్నారు యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. అనుదీప్ కె.వి. దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురువారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు నవీన్.
నటుడిగా సంతృప్తి..
నా తొలి రెండు చిత్రాలు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'చిచ్చోరే' హిట్ అయ్యాయి. దాంతో మూడో చిత్రంపై కాస్త ఒత్తిడి ఉండేది. ప్రేక్షకుల అంచనాలు అందుకునే మంచి కథ కోసం ఎదురుచూశాను. ఓ సారి దర్శకుడు నాగ్ అశ్విన్ ఫోన్ చేసి ఓ కథ విని, నువ్వు చేస్తే బాగుంటుందన్నారు. సరే అని దర్శకుడు అనుదీప్‌ని కలిశాను. ఆ కథ చెప్తున్నప్పుడే అందులోని జోగిపేట శ్రీకాంత్ పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. నా పేరు ఎవరికీ తెలీదు కానీ నేనెక్కడికెళ్లినా ఏజెంట్ అనే పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్ర ప్రభావం చూపింది. అలా అని అదే తరహాలో మరో చిత్రం చేస్తే కొత్తేమీ ఉండదు. ఎలాంటి పాత్ర పోషిస్తే దీన్ని నుంచి బయటపడొచ్చు అనుకుంటున్నప్పుడు ఈ కథ వచ్చింది. ఇది అయితేనే ఏజెంట్‌ని మరిపిస్తుందనిపించింది. నటుడిగా నాకూ సంతృప్తి ఉంటుందని ఓకే చేశాను. తర్వాత డ్రీమ్ ప్రాజెక్టులా మారిపోయింది.
ఇది వ్యంగ్యాత్మకం..
దేశానికి సేవ చేసిన వాళ్లని, గొప్ప గొప్ప వాళ్లని ‘జాతి రత్నాలు’ అని పిలుస్తుంటారు. కానీ, ఈ చిత్రంలోని పాత్రలకు సరిపోతుందని మేము వ్యంగ్యంగా ఈ పేరు పెట్టాం. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నటుల్ని ఎంపిక చేసుకుని ఇలాంటి సదవకాశం ఇచ్చిన మా నిర్మాతలే (స్వప్న, ప్రియాంక, నాగ్ అశ్విన్) అసలైన జాతి రత్నాలు. ప్రతిభను గుర్తించి మాపై నమ్మకంతో రూపొందించారు.