జాకీచాన్ అందరికీ సుపరిచితమే.. కానీ ఆ నటుడి అసలు పేరు చాన్ కాంగ్ సాంగ్. అంటే హాంకాంగ్‌లో పుట్టిన డ్రాగన్ అని అర్థం. అభిమానులు ‘బిగ్ బ్రదర్‌గా పిలుచుకునే ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు, మార్షల్ యుద్ధ విద్యా నిపుణుడు, దర్శకుడు, నిర్మాత, స్టంట్‌మ్యాన్, గాయకుడు. కుంగ్‌ఫూ, హాప్‌కిడో, కరాటే, తైక్వాండో, జూడో, జీత్‌కునే దో లాంటి విద్యల్లో ప్రవేశం ఉంది. నేడే ఈ హీరో పుట్టినరోజు .
160 సినిమాలకు పైగా నటించిన జాకీచాన్ తన సినిమాల్లో పోరాటాలను తానే రూపొందిస్తాడు. పాటల్ని స్వయంగా రాసి... పాడుతాడు కూడా. విడిగా వందలాది ఆల్బమ్స్ ద్వారా పాప్ ప్రియులకు అభిమాన గాయకుడు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం 2015 నాటికే 350 మిలియన్ డాలర్ల విలువ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు జాకీచాన్.
చిన్నప్పుడే నటన
ఐదేళ్ల వయసులోనే చిన్న చిన్న వేషాలు వేసిన జాకీచాన్.. ఎనిమిదేళ్లకల్లా ‘'బిగ్ అండ్ లిటిల్ వాంగ్ టిన్ బార్’' (1962), ‘'ది లవ్ ఎటర్న్’' (1963), ‘'కమ్ డ్రింక్ విత్ మి'’ (1966) లాంటి సినిమాల్లో నటించాడు. పదిహేడేళ్ల వయసు వచ్చేసరికి బ్రూస్‌లీ నటించిన ప్రపంచప్రఖ్యాత సినిమాలు ‘'ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ’', ‘'ఎంటర్ ది డ్రాగన్'’ సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగాడు.