తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇటు అఖిల్‌.. అటు ప్రభాస్‌.. పరశురామ్ దారెటు..! - అఖిల్​తో పరశురామ్

'గీత గోవిందం' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు పరశురామ్. ప్రస్తుతం అఖిల్​, ప్రభాస్​లతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడీ డైరెక్టర్.

పరశురామ్

By

Published : Nov 10, 2019, 9:15 AM IST

పరాజయాల్లో ఉన్నప్పుడు అవకాశాలు రావట్లేదంటే ఓ అర్థముంటుంది కానీ, చేతిలో అదిరిపోయే విజయాలున్నా ఛాన్స్‌లు దక్కకపోవడం కాస్త భిన్నమైన అనుభవమనే చెప్పాలి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు పరశురామ్‌. 'గీత గోవిందం' వంటి మీడియం బడ్జెట్‌ చిత్రంతో రూ.100 కోట్ల వసూళ్లు కురిపించిన ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి అలుపెరుగని పోరాటమే చేస్తున్నాడు.

'గీత గోవిందం' తర్వాత పరశురామ్.. బన్నీతో ఓ సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపించినా అవి నిజం కాలేదు. ఇక మహేశ్​బాబుతో ఎలాగైనా ఓ ప్రాజెక్టు ఓకే చేయించుకోవాలని రెండు, మూడు కథలు వినిపించినప్పటికీ అవి సూపర్‌స్టార్‌ను ఏమాత్రం మెప్పించలేకపోయాయట. ఇక ఇది ఎటూ తెగేలా లేదని పరశురామ్.. మహేశ్ కాంపౌండ్‌ను వదిలి అక్కినేని ఇంట చేరాడట.

ప్రస్తుతం ఈ దర్శకుడు అఖిల్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అక్కీ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌కు సరిపోయేలా ఓ సరికొత్త ప్రేమకథను వినిపించాడట. ఇది అఖిల్‌కు నచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. బొమ్మరిల్లు భాస్కర్‌ చిత్రం పూర్తయిన వెంçటనే ఈ అక్కినేని యువ హీరోతో పరశురామ్‌ సెట్స్‌లోకి వెళ్తాడని తెలుస్తోంది.

ఓ పాన్‌ ఇండియా చిత్రానికి కూడా పరశురామ్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఈ యువ దర్శకుడు డార్లింగ్‌కు కథను వివరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ముందుగా కార్యరూపం దాల్చేది ఏదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ఇవీ చూడండి.. ప్రభాస్ 'జాన్' సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే..!

ABOUT THE AUTHOR

...view details