RRR release date: 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలకు కొత్త తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం ముందుగా అనుకున్న మార్చి 18 లేదా ఏఫ్రిల్ 28న కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించింది. మార్చి 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే. అంతకు రెండు రోజుల ముందే సినిమా రిలీజ్ అవతుండటం వల్ల చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
'ఆచార్య' కూడా..
Chiranjeevi Acharya movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. చర్చల అనంతరం పరస్పర అంగీకారంతో విడుదల తేదీలను ఖరారు చేసినట్లు తెలిపారు.
దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా చేసింది. రామ్‌చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.
'భీమ్లా నాయక్'.. రెండు తేదీలతో
మరోవైపు పవన్‌కల్యాణ్-రానా కలిసి నటిస్తున్న 'భీమ్లా నాయక్' కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25న కానీ, పరిస్థితులు సహకరించిన పక్షంలో ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.