ఈ సాయంత్రం మీ ఇంట్లోనే షారుఖ్ ఖాన్ తన సిగ్నేచర్ స్టైల్‌లో రెండు చేతులు బార్లా చాపి మిమ్మల్ని రొమాంటిక్‌గా పలకరిస్తే.. ఏఆర్ రెహమాన్ హుషారుగా కీబోర్డు ప్లే చేస్తూ సూపర్‌హిట్ పాటలను స్వయంగా వినిపిస్తే.. ఐశ్వర్యరాయ్ నీలి కన్నులతో కొంటెగా కవ్విస్తే.. మాధురీ దీక్షిత్ డ్యాన్స్‌తో జోరు చూపిస్తే.. ఎలా ఉంటుంది! లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఈ సమయంలో బోలెడు వినోదం కదూ. ఇవన్నీ నిజంగానే జరగబోతున్నాయి. వీరే కాదండోయ్ ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ లాంటి ప్రముఖ తారలతో పాటు శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ లాంటి పలువురు గాయనీ గాయకులు, సంగీత దర్శకులు ఒక్కటై వీక్షకుల్ని అలరించబోతున్నారు. 'ఐ ఫర్ ఇండియా' పేరుతో 85 మంది సినీ ప్రముఖులతో ఫేస్‌బుక్ లైవ్‌లో ఓ భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
పేదల ఆకలి తీర్చేందుకు స్టార్స్ అందరూ కలిసి.. - ఫేస్‌బుక్ లైవ్‌లో ఐ ఫర్ ఇండియా
కరోనాపై పోరుకు టాలీవుడ్ టు హాలీవుడ్ సినీ సెలబ్రిటీలందరూ నడుం బిగించారు. నేడు 'ఐ ఫర్ ఇండియా' పేరుతో 85 మంది సినీ ప్రముఖులు ఫేస్‌బుక్ లైవ్‌లో ఓ భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించడమే కాకుండా వినోదాన్ని కూడా పంచనున్నారు.
దక్షిణాది నుంచి రానా, శ్రుతి హాసన్ తదితరులు కూడా భాగం పంచుకోనున్నారు. విల్‌స్మిత్‌తోపాటు మరికొంత మంది హాలీవుడ్ తారలూ పాలుపంచుకుంటున్నారు. విరాట్ కోహ్లీ, సానియా మీర్జా లాంటి క్రీడాకారులు ప్రత్యేకాకర్షణగా నిలవనున్నారు. కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించడానికి, వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించడానికి, లాక్‌డౌన్ వేళ ఇళ్లలోనే ఉన్న జనాలకు వినోదం పంచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 నుంచి నాలుగు గంటలపాటు గివ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరగనుంది. తారలు వారి ఇళ్లలో నుంచే తమ ప్రదర్శనలతో వినోదం పంచనున్నారు.