తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాలు ప్రారంభమైనా ఆ పాత్రల్లో ఎవరో తెలియదే?

సినిమా ప్రారంభానికి ముందే నటీనటుల ఎంపిక అంటే పక్కాగా ఉండే చిత్రబృందాలు.. ప్రస్తుతం కొద్దిగా జాప్యం చేస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక బృందాలను చేర్చుకున్న తర్వాత ప్రాజెక్టును షురూ చేసే నిర్మాణసంస్థలు.. చిత్రీకరణ జరుగుతుండగా ఆ పాత్రలకు సంబంధించిన వారిని తీసుకుంటున్నారు.

In the past, the film was chosen by all those who acted in it as expected.
సినిమాల్లో ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!

By

Published : Apr 17, 2021, 9:13 AM IST

Updated : Apr 17, 2021, 9:50 AM IST

ఈ రోజుల్లో సినిమాలకు కొబ్బరికాయ కొట్టక ముందే నటీనటులు.. సాంకేతికవర్గం పూర్తిగా ఖరారైపోతుంది. ఒక్కసారి సినిమా మొదలయ్యిందంటే ఆ స్క్రిప్టులో.. ఇతరత్రా విషయాల్లో చిన్న మార్పు చేయడానికి ఇష్టపడని దర్శక నిర్మాతలు, హీరోలు చాలామంది ఉన్నారు. తొలి నాళ్లల్లో ఈ విషయంలో మరింత పక్కాగా ఉండేవారు. ఏం చేసినా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే అంత పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగేవారు. ఇటీవల ఆ విషయంలో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. సినిమాలు సగం పూర్తయినా నటీనటుల ఎంపికపై స్పష్టత రావడం లేదు. వాళ్లపై సన్నివేశాలు తీసేవరకు అన్వేషణ సాగుతోంది. సాంకేతిక బృందం విషయంలోనూ అంతే.

కావాలి నాయిక.. రావాలి ప్రతినాయకుడు

  • ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌' సినిమా సగానికి పైగా పూర్తయ్యాక సంగీత దర్శకుల్ని ఎంపిక చేశారు. దక్షిణాది భాషల్లో జస్టిన్‌ ప్రభాకర్‌, హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
  • అల్లు అర్జున్‌ 'పుష్ప' చిత్రీకరణ చాలా భాగం పూర్తయ్యాక, అందులో విలన్‌ పాత్ర కోసం ఇటీవలే ఫాహద్‌ ఫాజిల్‌ ఎంపికయ్యారు. ఆయన ఇంకా సెట్స్‌పైకి రాలేదు. వచ్చే నెలలో చిత్రీకరణకు రానున్నారని తెలుస్తోంది.
  • చిరంజీవి-రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న 'ఆచార్య'లో కథానాయిక విషయంలో ఇలాగే జరిగింది. సగానికి పైగా సినిమా పూర్తయ్యాకే పూజాహెగ్డేను రంగంలోకి దించారు. ఆయా తారల కాల్షీట్లు.. పారితోషికాలు తదితర విషయాల్ని దృష్టిలో ఉంచుకొని ఆచితూచి ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
  • ఇప్పుడు సెట్స్‌పై ఉన్న రెండు ప్రధాన చిత్రాలకు ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి కథానాయకులుగా 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌ తెరకెక్కుతోంది. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా సరసన కథానాయికగా ఐశ్వర్య రాజేశ్​‌ ఎంపికయ్యారు. పవన్‌కు తగ్గ జోడీనే ఇంకా కుదరలేదు. అయితే ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. పవన్‌కు జోడీగా నటించే కథానాయికలంటూ పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు నిత్యమేనన్‌ పేరు వినిపిస్తోంది.
  • మహేశ్​బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో ఆయన్ని ఢీ కొట్టే విలన్‌ ఎవరన్నది ఇంకా తేలలేదు. అరవింద్‌ స్వామి, ఉపేంద్ర తదితర పేర్లు వినిపించినా ఇంకా ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రస్తుతం మాధవన్‌ పేరు తెరపైకొచ్చింది. మరి ఇందులో ప్రతినాయకుడు ఎవరనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
  • ఇదీ చదవండి:ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

ఎందుకిలా?

కొన్నిసార్లు సినిమా చిత్రీకరణల్లో ఆలస్యం జరుగుతుంటుంది. అలాంటి సమయంలో తారల కాల్షీట్లు వృథా అవుతాయి. ముఖ్యంగా కథానాయికల కాల్షీట్లు. వాళ్లు ఒకే సమయంలో నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. హీరోలైతే సినిమా పూర్తయ్యాక గానీ, మరో సినిమా కోసం రంగంలోకి దిగరు. కథానాయికలు అలా కాదు.. అందుకే చిత్రీకరణ సాగుతున్న తీరును దృష్టిలో ఉంచుకొని ఆ సమయంలో అందుబాటులో ఉన్న కథానాయికల్ని ఎంపిక చేసుకుంటుంటారు. కొన్నిసార్లు సరైన జోడీ దొరికేవరకు అన్వేషణ సాగుతుంటుంది. ప్రతినాయకులు, ఇతర ముఖ్యపాత్రల విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తారు. తుది ఎంపిక పూర్తయ్యేలోపు సినిమాని ఆపకుండా.. హీరోలు, ఇతర తారాగణంపై తీయాల్సిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తుంటారు.

ఇదీ చదవండి:ప్రభాస్‌ జాబితాలో మరో సినిమా..!

Last Updated : Apr 17, 2021, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details