'పవన్ కల్యాణ్‌ను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను' అంటోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. 'హరిహర వీరమల్లు' చిత్రంలో ఆయన సరసన నటిస్తోంది ఈ భామ. ఈ చిత్రంలోని తన పాత్ర, పవన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"నేను పవన్ కల్యాణ్‌కు పెద్ద అభిమానిని. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేయాలనే కల 'హరిహర వీరమల్లు'తో నిజమైంది. పవన్ అద్భుతమైన నటుడు. అలాంటి నటుడితో కలిసి పని చేస్తుండటం గొప్ప అనుభూతినిస్తోంది. ఆయన చుట్టూ తెలియని ఏదో శక్తి దాగి ఉంది. అందుకే పవన్ సెట్‌లో అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా చేస్తోన్న పనిని ఆపేసి ఆయన్నే చూస్తుంటారు. పవన్ గురించి చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఏదైనా సన్నివేశం రిహార్సల్స్ చేయాల్సివస్తే అదొక బాధ్యతగా కాకుండా చాలా ఆనందంగా చేస్తుంటారు. ఈ చిత్రంలో భాగస్వామిని కావడం వల్ల ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇందులో నా పాత్ర అసాధారణమైంది. పీరియాడికల్ డ్రామా నేపథ్యం కావడం వల్ల రాజసం ఉట్టిపడే వస్త్రాల్లోనే కనిపిస్తాను తప్ప మునపటిలా జీన్స్‌ల్లో కనిపించను. నా పాత్రను వెండితెరపై చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గత చిత్రాల్లోని పాత్రలకు మేకప్ వేసేందుకు 20 నిమిషాల సమయం పడితే ఈ సినిమాలోని పాత్ర కోసం 90 నిమిషాలు పడుతోంది" అని తెలియజేసింది.