ఒక్కసారి కమిట్ అయితే సినీ అభిమానులు ఎవరి మాట వినరు. అందుకే, తమ అభిమాన తారల సినిమాలు చూడడమే కాదు.. అందులో వాడిన వస్తువులనూ ప్రేమిస్తారు. అలాంటి వాటికి నకిలీలు మార్కెట్లోకొస్తే.. ఎగబడి మరీ సొంతం చేసుకుంటారు. మరి నిజంగా సినిమాల్లో హీరోలు వాడిన వస్తువే వేలానికి పెడితే.. లక్షలు పోసైనా చేజిక్కించుకోరూ? అక్షరాలా అదే చేశారు కొందరు బాలీవుడ్ ఫ్యాన్స్. అలా జరిగిన వేలంలో ఏ వస్తువును ఎంత పెట్టి కొన్నారో తెలుసుకోండి.
1. బాబోయ్ బ్యాటుకెంత రేటు?
అశుతోష్ గోవారికర్ తీసిన సినిమా 'లగాన్'(2000). అయితే ఇందులో హీరోగా నటించిన అమిర్ ఖాన్.. చేతితో తయారు చేసిన క్రికెట్ బ్యాటును ఉపయోగించారు. దీనిని వేలం వేయగా అక్షరాల రూ. 1,56,000 పెట్టి ఓ అభిమాని కొనుక్కున్నారు.
2. లక్షలు పలికిన టవల్
'ముజ్సే షాదీ కరోగి' సినిమాలో సల్మాన్ ఖాన్ టవల్ స్టెప్ గుర్తుందా? థియేటర్లలో ఈలలు వేయించిందీ పాట. అయితే అందులో ఉన్న టవల్‌ను ఈబే ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో వేలంవేయగా, రూ.100 విలువైన ఈ వస్తువు.. రూ.1.42 లక్షల పలికింది. ఆ డబ్బును ఓ ఎన్జీవోకు విరాళంగా ఇచ్చింది చిత్ర బృందం.
3. ఫొటోలకూ క్రేజీ క్రేజ్
బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్‌కు సంబంధించిన 45 బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు వేలంవేస్తే రూ. 4 లక్షలు ఖర్చు చేసిన అభిమానులు కొనుక్కున్నారు. ఆన్లైన్లో వెతికితే కనిపించే ఫొటోలకు లక్షలు పెట్టారేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆరు దశాబ్దాల క్రితం తీసిన ఆ ఫొటోల ఒరిజినల్ కాపీలకు దక్కిన విలువ కట్టలేని అభిమానమది.