బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా) ప్రచారకర్తగా మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఇటీవలే ఎంపికయ్యాడు. దీనిపై రెహమాన్ స్పందిస్తూ.. కెరీర్లో అత్యుత్తమ బాధ్యతలు దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. అదే విధంగా భారత్‌లో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ప్రతిభావంతులకు తాను సహాయం అందించాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశాడు.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో భారతదేశంలోని చలనచిత్రాలు, టీవీ రంగాల్లో పనిచేసే ఐదుగురు ప్రతిభావంతులను రెహమాన్ గుర్తించాల్సిఉంది. వారికి మద్దతుగా నిలవడమే లక్ష్యంగా రెహమాన్ బృందం పనిచేయాల్సి ఉంటుంది. దేశంలోని సృజనాత్మకను కనుగొనడానికి బాఫ్టా సహాయం చేయడమే కాకుండా ఆ సంస్థ గురించి దేశంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తామని రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"నా బృందంలోని ఇతర న్యాయమూర్తులతో భారతదేశంలోని అద్భుతమైన, అసలైన స్వరాలను కనుగొనడం నా పని. ఎంపిక చేసిన వారికి ఏడాది పాటు శిక్షణ అందిస్తాం. శిక్షణలో భాగంగా సరైన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సహా మెంటర్షిప్, స్క్రీనింగ్, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం. అలాంటి ప్రతిభ గల బాఫ్టా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వారిలో మరింత మార్పు వస్తుంది".