భారతీయ నటులకు హాలీవుడ్‌లో నటించడం అంటే గొప్ప అవకాశం. అందుకే ఎవరూ దాన్ని వదులుకోరు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హాలీవుడ్‌లో మెరిశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి (Huma Qureshi) ఈ ఏడాది హాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించే ఛాన్స్ కొట్టేసింది. ఆమె నటించిన 'ఆర్మీ ఆఫ్ ది డెడ్' (Army of the Dead) చిత్రం గత నెల్లో విడుదలైంది. ఇందులో హ్యూమా పాత్ర నిడివి తక్కువగా ఉందంటూ సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు వినిపించాయి. దీనిపై హ్యూమా స్పందించింది.
"నా పాత్ర నిడివి గురించి నేను ఎప్పుడూ పట్టించుకోను. నా పాత్ర ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించి వారి ప్రేమాభిమానాల్ని పొందడమే నాకు ముఖ్యం. నా తొలి చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్'(Gangs of Wasseypur) లో నాది 15 నిమిషాల పాత్రే. కానీ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు రావడానికి కారణమైంది. అలాగే జాక్ స్నైడర్ (Zack Snyder) లాంటి గొప్ప దర్శకుడి చిత్రంతో హాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టాను. సినిమాలో ఎంతసేపు కనిపిస్తాను అనే దానికంటే సినిమాలో నా పాత్ర ఏం చేస్తుందనేదే నాకు ముఖ్యం. 'ఆర్మీ ఆఫ్ ది డెడ్'లో నేను పోషించిన గీత పాత్ర అలాంటిదే. కథలో కీలకంగా నిలుస్తూ కథను ప్రభావితం చేసే పాత్ర అది."