ఎత్తైన కొండ... దానిపై తళతళలాడుతూ, సుదూరానికి కూడా కనిపించే 'హాలీవుడ్' అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెలిస్‌లో హాలీవుడ్ హిల్స్ ప్రాంతంలో శాంటా మోనికా కొండల్లో మౌంట్‌లీ అనే కొండపై కనిపించే దృశ్యమిది. దీన్ని చూసిన వారు ఎవరైనా ఔరా అనాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను ఇది విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రజలకు అంకితం
అమెరికా అనగానే గుర్తొచ్చే ప్రస్ఫుటమైన చిహ్నాల్లో ఈ హాలీవుడ్ కొండ ఒకటి. దీన్ని 'హాలీవుడ్ సైన్'(సంతకం) అంటారు. 1923లో జులై 13న దీన్ని అధికారికంగా ప్రజలకు అంకితం చేశారు. మొదట్లో 'హాలీవుడ్ ల్యాండ్' అనే అక్షరాలు ఉండేవి. తర్వాత 1949లో మరమ్మతులు చేసినప్పుడు కేవలం హాలీవుడ్ అనే అక్షరాలనే ఉంచారు. ఈ సంతకంలోని ఒక్కో అక్షరం 44 అడుగుల ఎత్తు ఉండటం విశేషం. మొత్తం అన్ని అక్షరాలు కలిపి 352 అడుగుల పొడవుగా అమరి ఉంటాయి.