తనకు క్రష్ అంటూ ఎవరూ లేరని.. ఉన్నా చెప్పనని, తాను పుట్టి పెరిగింది నాగ్‌పూర్‌లో అయినా తెలుగు చక్కగా మాట్లాడగలనని చెప్పుకొచ్చింది 'నారింజ మిఠాయి' ఫేమ్ సునయన. శ్రీవిష్ణు 'రాజరాజ చోర'లో ఆమె కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సునయన విలేకరులతో ముచ్చటించింది. అందులో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
నేను తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. అయితే.. తెలుగులో ఒక మంచి సినిమా చేయాలని మొదటి నుంచి నా మనసులో ఉంది. 2019లో నేను చేసిన తమిళ చిత్రం 'సిల్లు కరుప్పత్తి' తెలుగులో 'నారింజ మిఠాయి' పేరుతో విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ హసిత్ నన్ను సంప్రదించారు. కథ చెప్పారు. స్క్రిప్టు విన్న తర్వాత నటించే అవకాశం ఉన్న పాత్ర అనిపించడం వల్ల ఓకే చెప్పాను. అలా సినిమాకు ఒప్పుకొన్నాను.
సినిమాలో నా పాత్ర పేరు విద్య. ఆమె లాయర్. నటనా ప్రాధాన్యమున్న సినిమా ఇది. లాయర్ అంటే వాళ్లు బాగా ఆత్మవిశ్వాసంతో గట్టిగా మాట్లాడుతుంటారు. నాకు అలాంటివి రావు. అందుకే ఈ సినిమాలో లాయర్ పాత్ర కావడం వల్ల బాగా ప్రాక్టీస్ చేశాను. డైరెక్టర్ హసిత్‌తో మాట్లాడాను. రీసెర్చ్ కూడా చేశాను.
* సినిమా పూర్తి కామిక్ చిత్రం. నా పాత్ర మాత్రం సీరియస్ కేరెక్టర్. కుటుంబంతో కలిసి హాయిగా ఆ ఆస్వాదించగలిగే సినిమా.
సెట్లో విష్ణు ఎక్కువగా మాట్లాడరు. మనం వెళ్లి కదిలిస్తేనే మాట్లాడుతారు. బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సినిమాలో అనవసరమైన పాటలు లేవు. హసిత్ గురించి చెప్పాలంటే.. ఆయనకు అన్నీ తెలుసని నా అభిప్రాయం. ఏ పని చేసినా ఆయన దగ్గర కనీసం పది కారణాలుంటాయి. బాగా ఆలోచించి ముందడుగు వస్తారు. మనకు రాబోయే మంచి డైరెక్టర్లలో హసిత్ ఒకరు. నేను ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో నాలో ఆత్మవిశ్వాసం పెంచిన డైరెక్టర్.
నేను నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగాను. తెలుగులో ‘టెన్త్ క్లాస్’ చేశాను. ఆ తర్వాత తమిళంలో ఎక్కువగా అవకాశాలు రావడం వల్ల అక్కడికి వెళ్లిపోయాను. ఇప్పుడు మళ్లీ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా కథ నా దగ్గరికి వచ్చింది. తెలుగులో సినిమాలు చేస్తున్న కారణంగానే తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నా. దానికి తోడు నేను చేసిన చాలా సినిమాల్లో టెక్నీషియన్లలో తెలుగువాళ్లు ఉంటారు. వాళ్లతో మాట్లాడుతూ ఉండేదాన్ని.
* క్రష్ అంటూ ఎవరూ లేరు. ఉన్నా క్రష్ ఎవరో నేను చెప్పను. అభిమాన హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అందర్నీ సమానంగా అభిమానిస్తా. ఎందుకంటే వాళ్లంతా ఎంత కష్టపడతారో నాకు తెలుసు.
ఏదో ఒక రకమైన పాత్రలు చేయాలని ఏం లేదు. అన్నిరకాల పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. తమిళంలో నా సినిమాలను గమనిస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మనకు నచ్చిన పాత్రలే రావాలని ఏం లేదు కదా.! అందుకే ఫలానా పాత్రలు అని ప్రత్యేకంగా లేకుండా.. కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఇలా సినిమా ఏదైనా నన్ను నేను నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం. ‘రాజ రాజ చోర’ కూడా నాకు నచ్చిన పాత్రల్లోకి వస్తుంది.
నాని నిర్మిస్తున్న 'మీట్ క్యూట్'లో నటిస్తున్నాను. హిందీలో ఇంతవరకూ అవకాశం అయితే రాలేదు. నారింజ మిఠాయి చూసి 'రాజరాజ చోర', 'మీట్ క్యూట్'లో అవకాశం వచ్చింది. ఈ సినిమా అర్థం కావాలంటే మైండ్ పెట్టాల్సిందే.