తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema: ఒకే సినిమాలో ఇద్దరు భామలు.. కాకపోతే కాస్త డిఫరెంట్! - keerthy suresh kajal

ఈ మధ్య కాలంలో టాలీవుడ్​లో కొన్ని సినిమాలను కొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారు. యువ హీరోయిన్లతో సీనియర్​ కథానాయికలు నటిస్తూ.. చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నారు. ఇంతకీ ఆ సినిమాలేంటి? అందులో నాయికలు ఎవరు?

heroine multi starrers in in telugu movies
మూవీ న్యూస్

By

Published : Jun 14, 2021, 7:04 AM IST

"చిన్నదో వైపు.. పెద్దదో వైపు" అంటూ కథానాయకులు ఇద్దరు భామలతో చిందేస్తుంటే.. చూసే సినీప్రియులకూ భలే ముచ్చటగా అనిపిస్తుంటుంది. అందుకే అవకాశమున్న ప్రతిసారీ సినిమాలో ఇద్దరేసి నాయికలకు చోటిచ్చే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే ఇలా ఆడిపాడే భామలంతా సమవుజ్జీలే ఉంటారు. ఈ మధ్య కొత్త ఒరవడి కనిపిస్తోంది. సీనియర్‌ నాయికలు.. యువ హీరోయిన్లతో కలిసి సందడి చేస్తున్నారు. ఇప్పుడా కలయికలు ప్రేక్షకులకు కొత్త అనుభూతులు పంచుతున్నాయి. సీనియర్‌ భామల అనుభవాలు కొత్త అందాలకు పాఠాలవుతుంటే.. కొత్త భామలల్లోని మెరుపుల్ని సీనియర్‌ నాయికలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సినీ ప్రేమికులకు కొత్త కలయికలు చూసే అవకాశం దక్కుతోంది.

కీర్తి సురేశ్ - కాజల్ అగర్వాల్

అనుభవానికి నవతరం ఉత్సాహం తోడైతే.. ఆ కలయికకు తిరుగుండదు. అందుకే కథ డిమాండ్‌ చేసిన ప్రతిసారీ.. పాత, కొత్తల కలయికతో ప్రయోగాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అలాంటి కథలు దొరికినప్పుడు అందాల భామలు కూడా 'సీనియర్‌.. జూనియర్‌' అని లెక్కలేసుకోకుండా తెర పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ తరహా కలయికలు తెలుగులో విరివిగా సందడి చేస్తున్నాయి. 'మహానటి' సినిమాతో స్టార్‌ నాయికగా మారింది కీర్తి సురేష్‌. నాయికా ప్రాధాన్య చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ.. స్టార్‌ నుంచి సూపర్‌స్టార్‌ స్థాయికి చేరుకుంది నయనతార. అందం.. అభినయాల్లో పోటాపోటీగా నిలిచే ఈ భామలిద్దరూ.. ఇప్పుడు ‘అణ్నాత్తే’ కోసం చేయి కలిపారు. వీరితో నటి మీనా.. ఖుష్బు లాంటి నిన్నటి తరం నాయికలు కలిసి సందడి చేస్తుండటం మరో విశేషం. ఇప్పుడీ నాయికల అనుభవం.. కొత్తదనాల మేళవింపుతో సినీప్రియులకు కొత్త వినోదం అందనుంది. సూపర్​స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాది నవంబరు 4న థియేటర్లలోకి రానుంది. నయన్‌ ప్రస్తుతం నటి సమంతతో కలిసి ‘కాతు వాకులా రేండు కాదల్‌’ అనే చిత్రం చేస్తోంది.

ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘విరాటపర్వం’ చిత్రం కూడా ‘అణ్నాత్తే’ కోవకు చెందినదే. పక్కాగా చెప్పాలంటే.. కొత్త ప్రతిభకు పట్టం కడుతూనే అనుభవానికి పెద్ద పీట వేసిన చిత్రమిది. ఓవైపు సాయిపల్లవి, నివేదా పేతురాజ్‌ లాంటి ఈతరం భామలు.. మరోవైపు ప్రియమణి, నందితాదాస్‌ లాంటి అనుభవజ్ఞులు. వీళ్లకి తోడుగా జరీనా వాహబ్‌ లాంటి పాత తరం అందాలు. ఇలా విభిన్న అనుభవాల సమాహారంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ సినిమా. విప్లవం నిండిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. 90ల్లో తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిస్తున్నారు. రానా కథానాయకుడిగా నటించారు. వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రియమణి నయనతార

అలరించే కలయికలు

వెండితెరపై దశాబ్దంన్నర సినీప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నటి తమన్నా. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటోన్న అందం నభా నటేష్‌. ఇప్పుడీ జోడీ నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘మ్యాస్ట్రో’ కోసం తెర పంచుకుంటోంది. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధూన్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో టబు పోషించిన నెగటివ్‌ పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తోంది. రాధికా ఆప్టే చేసిన పాత్రలో నభా నటిస్తోంది. సినిమాలో ఈ రెండు పాత్రలకూ ఎంతో ప్రాధాన్యముంది. ఒకరిది అందచందాలతో అలరించే పాత్రయితే.. మరొకరిది అనుభవంతో రక్తి కట్టించాల్సిన పాత్ర. మరి ఈ ఇరువురి నాయికలు పంచే వినోదం ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఇప్పుడు తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా ప్రస్తుతం ‘ఎఫ్‌3’ చిత్రం కోసం మరో యువ నాయిక మెహరీన్‌తోనూ తెర పంచుకుంటోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా.. వెంకటేష్‌కు జోడీగా నటిస్తుండగా, మెహ్రీన్‌.. వరుణ్‌ తేజ్‌ సరసన ఆడిపాడుతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ముస్తాబవుతున్న ఈ సినిమా.. త్వరలో సినీప్రియుల ముందుకు రానుంది.

నభా నటేశ్ తమన్నా

17ఏళ్ల సినీ కెరీర్‌లో దక్షిణాదిలోని అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడిన అనుభవం కాజల్‌ సొంతం. స్టార్‌ నాయికగా ఇప్పుడిప్పుడే జోరు చూపిస్తున్న అందం పూజా హెగ్డే. ఇప్పుడీ నాయికలు ‘ఆచార్య’లో సందడి చేస్తున్నారు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. కొరటాల శివ దర్శకుడు. ఇందులో చిరుకు జోడీగా కాజల్‌ నటిస్తుండగా.. చరణ్‌ సరసన పూజా ఆడిపాడుతోంది. ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం నటి శ్రియ చేస్తున్న ‘గమనం’లోనూ ఇలాంటి విభిన్న అనుభవాల కలయికలే కనువిందు చేస్తున్నాయి. సుజనా రావు దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. నాలుగు విభిన్న కథల సమాహారంగా తెరకెక్కుతోంది. ఇందులో శ్రియ.. నిత్యా మేనన్‌, ప్రియాంక జవాల్కర్‌లతో తెర పంచుకుంటోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధంగా ఉంది.

పూజా హెగ్డే సాయిపల్లవి

ABOUT THE AUTHOR

...view details