తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మెగాస్టార్ వ‌ల్లే మా సినిమాకు క్రేజ్ వ‌చ్చింది' - అర్జున్ సురవరం

'అర్జున్ సురవరం' సినిమా విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు హీరో నిఖిల్. ఈ చిత్ర ప్రయాణంలో తనకెదురైన కష్టాలు, అనుభవాలను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానం గురించి చెప్పాడు. తాను తీయబోయే తర్వాతి సినిమాలు గురించి వెల్లడించాడు.

'మెగాస్టార్ వ‌ల్లే మా సినిమాకు క్రేజ్ వ‌చ్చింది'
చిరంజీవి-నిఖిల్

By

Published : Nov 28, 2019, 3:29 PM IST

'హ్యాపీడేస్‌'తో అల్ల‌రి చేసిన నిఖిల్.. ఆ త‌ర‌వాత సోలో హీరోగా ఎదిగాడు. 'స్వామి రారా', 'కార్తికేయ' లాంటి హిట్లతో ప్రేక్షకుల మనసు దోచాడు. కాన్సెప్ట్ క‌థ‌ల‌కు కేరాఫ్‌గా నిలిచాడు. ఇప్పుడు 'అర్జున్ సుర‌వ‌రం'లో ఓ నిజాయ‌తీ ఉన్న పాత్రికేయుడిగా క‌నిపించ‌బోతున్నాడు. వాయిదాలు ప‌డుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్ట‌కేల‌కు విడుదల అవుతోంది. శుక్ర‌వారం థియేటర్లలోకి రానుంది. ఈ సంద‌ర్భంగా నిఖిల్‌తో చిట్ చాట్.

  • ఈ సినిమా వాయిదాలపై వాయిదాలు ప‌డుతున్న‌ప్పుడు ఎలాంటి ఒత్తిడి అనుభవించారు?

ఒక్క మాట‌లో చెప్ప‌డం క‌ష్టం. నిద్ర‌లేని రాత్రులెన్నో గ‌డిపా. ఏడుపొచ్చేసేది. మే 1న విడుద‌ల కావల్సిన సినిమా ఇది. చాలాసార్లు విడుద‌ల తేదీ ప్ర‌క‌టించాం. కానీ రిలీజ్ మా చేతుల్లో లేకుండా పోయింది. ఈ సినిమా బిజినెస్ ఎప్పుడో అయిపోయింది. మాకు సంబంధం లేని వ్య‌క్తుల వ‌ల్ల విడుదల కాకుండా ఆగిపోయింది. ఆ గొడ‌వ‌ల‌న్నీ ముగిసి, సినిమా బ‌య‌ట‌కు రావ‌డం ఆనందంగా ఉంది.

అర్జున్ సురవరంలో హీరో నిఖిల్
  • టైటిల్ మార్చాల్సి వ‌చ్చింది క‌దా?

అవును.. ముందు 'ముద్ర‌' అనే టైటిల్ నిర్ణయించాం. ఈ క‌థ‌కు ఆ టైటిలే నూటికి నూరు శాతం స‌రిపోతుంది. కానీ అప్ప‌టికే ఆ టైటిల్ మ‌రో సినిమాకు ఉపయోగించారు. ఆ విష‌యం తెలిసి మేం టైటిల్ మార్చాం. సుర‌వ‌రం ప్ర‌తాపరెడ్డి అనే ఓ గొప్ప పాత్రికేయుడి పేరును స్మ‌రించుకుంటూ ఈ పేరు పెట్టాం.

  • ప్రీ రిలీజ్ వేడుక‌లో వేదికపై డాన్స్ చేశారు. అంత ఉత్సాహం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది?

చిరంజీవిగారిని చూడ‌డం వ‌ల్లే. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌నకు వీరాభిమానిని. మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగాను. అంత పెద్ద స్టార్‌, ఓ చిన్న సినిమాను నిల‌బెట్ట‌ేందుకు వ‌చ్చారు. ఆయ‌న రావ‌డం వ‌ల్లే ఈ సినిమాకు క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు.

ప్రీరిలీజ్​ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవి
  • ఇదో రీమేక్ సినిమా క‌దా? మాతృకతో పోలిస్తే మార్పులు ఏ మేర‌కు ఉంటాయి?

రీమేక్ సినిమానే కానీ చాలా మార్పులు చేశాం. త‌మిళ చిత్రం చాలా సీరియ‌స్‌గా సాగుతుంది. మేం కాస్త వినోదం జోడించాం.

  • రీమేక్ క‌థ‌ల్ని మీరు పెద్ద‌గా ప్రోత్స‌హించ‌రు క‌దా.. పైగా మీకు స‌రైన ఫ‌లితాల్ని ఇవ్వ‌లేదు. కానీ మ‌ళ్లీ రీమేక్ ఎంచుకున్నారు. కార‌ణమేంటి?

అన్ని క‌థ‌లూ రీమేక్‌ల‌కు ప‌నిచేయ‌వు. 'హ్యాపీడేస్'​ను ఎక్క‌డ రీమేక్ చేసినా ఆడ‌దు. ఎందుకంటే ఆ సినిమాలో ఫీలింగ్స్ మాత్ర‌మే ఉంటాయి. 'పోకిరి' ఎక్క‌డైనా ఆడుతుంది. ఎందుకంటే అందులో ఫ్లాట్‌, మ‌లుపులు ఆక‌ట్టుకుంటాయి. ఈ క‌థ‌ను రీమేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇది యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్‌.

ప్రీరిలీజ్​ ఈవెంట్​లో మాట్లాడుతున్న హీరో నిఖిల్
  • ఈ సినిమా ఆల‌స్యం కావడం వ‌ల్లే, మీ కెరీర్‌పై దృష్టి పెట్టలేక‌పోయారా?

అదో కార‌ణం కావొచ్చు. ముందు ఈ సినిమాను బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న ఆలోచనతో ఉండేవాడ్ని. ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా. మా ప్ర‌య‌త్నం అంద‌రికీ చేరువ‌ కావాలి. జ‌నం చూడాలి. ముఖ్యంగా యువ‌త‌రం చూడాల్సిన సినిమా ఇది. ఇంత మంచి చిత్రం ఆగిపోవ‌డం నాకు ఇష్టం లేదు.

  • సినిమా ఆగిపోతున్న‌ప్పుడు మీవంతుగా మీరు ఏం చేశారు?

నా పారితోషికం ఎంత ఇస్తే అంత తీసుకున్నా. ముందు చెప్పిన పారితోషికానికి స‌గ‌మే ముట్టింది. ఇలా పారితోషికం త‌గ్గించుకుని సినిమా చేయ‌డం నా కెరీర్‌లో ఇదే తొలిసారి.

అర్జున్ సురవరంలో హీరో నిఖిల్-లావణ్య
  • ఇకపై సినిమాలు చేయడంలో జోరు పెంచుతారా?

త‌ప్ప‌కుండా. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏడాదికి ఓ సినిమా చేసుకుంటూ వ‌చ్చాను. అది స‌రిపోదు. అందుకే ఈసారి మూడు క‌థ‌లు ఒప్పుకున్నా. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుంది. 'కార్తికేయ 2' సీక్వెల్ ఈ వచ్చే నెలలో మొదలు కానుంది. 'హ‌నుమాన్‌' అనే మ‌రో క‌థ ఉంది. ఇవన్నీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇది చదవండి: 'అర్జున్ సురవరం' ప్రీరిలీజ్​ ఈవెంట్​లో కత్తి పట్టిన మెగాస్టార్

ABOUT THE AUTHOR

...view details