నాగచైతన్య, సాయిపల్లవి(love story trailer) జంటగా నటించిన 'లవ్‌స్టోరీ'(love story movie release date) సినిమా నేడు(సెప్టెంబరు 24) థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలు సహా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు చైతు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'లవ్‌స్టోరి'పై(love story movie) ఆత్మవిశ్వాసంతో ఉన్నారా?
నాగచైతన్య:సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోననే టెన్షన్ మాత్రం కొద్దిగా ఉంది. మూడు రోజుల టికెట్లన్నీ ముందే అయిపోయాయి. ఆ తర్వాత రోజుల్లో ఎలాంటి స్పందన ఉంటుందనేది చూడాలి. కుటుంబ ప్రేక్షకులు మా సినిమాతో మళ్లీ థియేటర్ బాట పడతారనే నమ్మకముంది.
మిగతా ప్రేమకథలకు 'లవ్‌స్టోరి'కి ఉన్న తేడా?
నాగచైతన్య: సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల దీన్ని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా అనిపించేది. మనమెందుకు వీటి గురించి చెప్పట్లేదని చాలా సార్లు అనుకున్నాను. ఇలాంటివి సినిమాల ద్వారా చెబితే ఎక్కువ మందికి చేరుతుంది. ప్రజలకు అవగాహన పెంచే అవకాశం దక్కుతుంది. శేఖర్ ఇలాంటి కథతోనే రావడం ఆనందమేసింది. 'లవ్‌స్టోరి' వాస్తవ జీవితానికి చాలా దగ్గర ఉండే ప్రేమకథ. రేవంత్, మౌనికల పాత్రలు అంతే రియలిస్టిక్‌గా ఉంటాయి.
రెండు రకాల క్లైమాక్స్‌లు తీశారట?
నాగచైతన్య:లేదు. ఒక క్లైమాక్స్ మాత్రమే తెరకెక్కించాం. లాక్డౌన్ సమయానికి షూట్ దాదాపు పూర్తయింది. ఆ తర్వాత 6,7 నెలల సమయం దొరికింది. పతాక సన్నివేశాలు మరింత మెరుగ్గా ఉండాలని, అదే క్లైమాక్స్‌ను కొన్ని మార్పులతో మళ్లీ తెరకెక్కించారు. ఇంత ఎక్కువ సమయం దొరకడం వల్ల డబ్బింగ్‌పైనా ఎక్కువ దృష్టి పెట్టే వీలుచిక్కింది. తెలంగాణ యాస కోసం పాటలు, వీడియోలు ఎక్కువ చూశాను.
ఇండస్ట్రీ అంతా మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది కదా?
నాగచైతన్య:కరోనా వల్ల చిత్ర పరిశ్రమకు కష్టాలు ఎదురయ్యాయి. రెండేళ్ల నుంచి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడొక బలమైన ముందడుగు పడాలి. ఇండస్ట్రీ కోసమైనా మా సినిమా ఆడాలి.
డ్యాన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నాగచైతన్య:పాట చిత్రీకరణంటే ఒక రకమైన భయముండేది. 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా నుంచి శేఖర్ మాస్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నా బాడీ లంగ్వేజ్ గమనిస్తూ నాకోసం ప్రత్యేకంగా డ్యాన్స్ రూపొందించారు. ఆయనకున్న ఓపిక, ఆత్మవిశ్వాసం నాకు బాగా ఉపయోగపడింది.
నాగార్జున ఏమన్నారు?
నాగచైతన్య: నాన్న చాలా హ్యపీగా ఉన్నారు. నటుడిగా ఈ సినిమాతో నాకొక సంతృప్తి దొరికింది.
లైవ్ లోకేషన్లలో పనిచేయడం ఎలా ఉంది?
నాగచైతన్య:ప్రజల మధ్య చిత్రీకరిస్తే మంచి నటనను రాబట్టుకోవచ్చనేది శేఖర్ గారికి గట్టి నమ్మకం. నేనూ దీనికి అంగీకరిస్తాను. అలాంటి లోకేషన్లలో చేస్తే ఏదో తెలియని శక్తి వస్తుంది. తక్కువ మంది బృందంతో వెళ్లి చిత్రీకరణ జరుపుకోవచ్చు. ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ అంటేనే నాకు ఇష్టం. 'మజిలి' తర్వాత మళ్లీ ఇందులోనే రియలిస్టిక్‌గా పనిచేసే అవకాశం దొరికింది.
కమర్షియల్ సినిమాలకు, శేఖర్ కమ్ముల సినిమా శైలికి ఎలాంటి తేడా కనిపించింది?
నాగచైతన్య:ఇప్పుడు సినిమాల ట్రెండ్ మారింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తోంది. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలను ఎక్కువగా ఆశిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా ఓ సారి మాట్లాడుతూ ఇదే అన్నారు. మనం కొత్తగా చేయడానికి వెనకాడతాం కానీ, ప్రేక్షకులు ఆదరించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారన్నారు. అందుకే కథాంశం విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాను.
స్టార్ డైరెక్టర్లతో ఎందుకు పనిచేయట్లేదు?
నాగచైతన్య:నాకు చిన్నాపెద్దా అనే తేడా లేదు. కథ మాత్రమే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. కానీ దర్శకులందరితో పనిచేయాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.
పాన్ ఇండియా సినిమాలపై ఎందుకు దృష్టి పెట్టట్లేదు?
నాగచైతన్య: పాన్ ఇండియా మార్కెట్ నాకు తెలియదు. ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్ మీదే ఉంది. తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేయాలని ఉంది. పాన్ ఇండియా స్థాయిలో కథ రాసుకుంటే, స్థానికంగా ఉండే మూలాలు దెబ్బతింటుందేమో అని నా అభిప్రాయం. కానీ హిందీలో మంచి అవకాశాలు వస్తే మాత్రం చేసేందుకు వెనకాడను.
అమిర్‌ఖాన్‌తో పనిచేసే అవకాశం ఎలా వచ్చింది?
నాగచైతన్య: అమిర్‌ఖాన్ గారే ఫోన్ చేసి ఓ రోజు ముంబయికి రమ్మన్నారు. అక్కడ కొన్ని సీన్లు చేసి చూపించాక, ఆయనకు నచ్చి 'లాల్‌సింగ్ చద్దా'లో(aamir khan naga chaitanya movie) అవకాశమిచ్చారు. ఈ పన్నేండేళ్ల కెరీర్లో నేర్చుకున్న దానికంటే ఎక్కువగా అమిర్‌ఖాన్‌తో పనిచేసిన 45 రోజుల్లో నేర్చుకున్నాను. ఆయనతో చేసిన ప్రయాణం చాలా ఉపయోగపడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారని ఊహించలేదు. ట్రైలర్ చూసి వచ్చారు. చాలా సింపుల్‌గా ఉంటారు.
అమిర్‌ఖాన్‌కు 'లవ్‌స్టోరి' చూపిస్తున్నారా?
నాగచైతన్య:ఆయనే సినిమా వేయమని అడిగారు. ఆయనకున్న సమయాన్ని బట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
శేఖర్ కమ్ములలో మిమ్మల్ని ప్రభావం చేసిన అంశాలేంటి?
నాగచైతన్య:శేఖర్ కమ్ముల మంచి విలువలున్న వ్యక్తి. సెట్ బాయ్ నుంచి హీరోహీరోయిన్ల వరకు అందరినీ ఒకే రకంగా చూస్తారు. ఇదంతా కావాలని చేయరు. ఆయన వ్యక్తిత్వమే అలాంటిది. శేఖర్‌తో నిరంతరం ప్రయాణించాలని, ఆయనతోనే ఉండిపోవాలనే భావనను కలిగిస్తారు. అందుకే ఈ సినిమా కోసం 200 రోజులైనా పని చేయొచ్చనిపించింది. అంతగా ప్రభావితం చేశారు. శేఖర్‌లో కనిపించే అంకితభావం, నిజాయతీ ఇంకెవరిలో చూడలేదు. ప్రతి చిన్న విషయాన్ని చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నటుడిగానూ ఎక్కువగా నేర్చుకునే వీలుంటుంది.