తెలంగాణ

telangana

ETV Bharat / sitara

2019 రౌండప్: ఈ ఏడాది టాప్ సాంగ్స్​ ఇవే

ఈ ఏడాది పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటే అందులోని పాటలు సామాజిక మాధ్యమాల్లో లైకులు, షేర్లతో జోరు చూపించాయి. అటువంటి 2019 హిట్ పాటలపై ఓ లుక్కేద్దాం.

mahesh
అనిరుధ్

By

Published : Dec 15, 2019, 5:44 AM IST

భారతీయ చిత్రాలకు సంగీతం ఊపిరి. సినిమాలు విడుదల కాకముందే పాటలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈ పాటలు మూవీ భవితవ్యాన్ని పూర్తిగా మార్చకున్నా.. కొంతవరకు కలెక్షన్లపై ప్రభావం చూపిస్తాయి. ఈ ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 2019 హిట్​ గీతాలపై ఓ లుక్కేద్దాం.

దేవీశ్రీ ప్రసాద్

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లోనే ఓ మ్యాజిక్ ఉంటుంది. యువత మది దోచే మెలోడీలతో పాటు ఐటెమ్ సాంగ్స్​తో మాస్ జనాలనూ మెప్పించగలడు. ఈ ఏడాదిలోనూ అలాంటి ఫీల్ గుడ్, ఊపునిచ్చే మాస్ బీట్స్‌ను అందించాడు. సంక్రాంతి బరిలో నిలిచిన 'వినయ విధేయ రామ'తో బోణి కొట్టిన దేవీ.. మంచి ఫలితాన్నే అందుకున్నాడు. సినిమా అనుకున్న రేంజ్​లో ఆడకపోయినా మ్యూజిక్ మాత్రం హిట్టయింది. తర్వాత ఎఫ్ 2, మహర్షి, చిత్రలహరి వంటి సినిమాలు దేవీ మ్యూజిక్​ పవర్​ను మరోసారి తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించాయి. వినయ విధేయ రామ (తందానే తందానే, ఏక్ బార్ ఏక్ బార్), ఎఫ్2 (ఎంతో ఫన్, గిర్రా గిర్రా, రెచ్చిపోదాం), మహర్షి (ఇదే కదా ఇదే కదా, పదర పదర, చోటి చోటి బాతే), చిత్ర లహరి (ప్రేమ వెన్నెల, గ్లాస్​మేట్స్) పాటలు ఆకట్టుకున్నాయి.

తమన్..

తమన్ ఈ ఏడాది ప్రథమార్థంలో అంతగా సందడి చేయకపోయినా.. సెకండాఫ్‌లో మాత్రం ఓ ఊపు ఊపేస్తున్నాడు. వరుస హిట్ పాటలతో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాడు. ఇతడి పాటలకు వస్తోన్న లైకులు యూట్యూబ్​లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సామజవరగమన, రాములో రాములా యువతను వెర్రెక్కిస్తున్నాయి. అల వైకుంఠపురములో (సామజవరగమన, రాములో రాముల, ఓఎమ్‌జీ డ్యాడీ), వెంకీమామ (వెంకీమామ టైటిల్ సాంగ్, కోకాకోలా పెప్సీ), ప్రతిరోజు పండగే (ఓ బావ, తకిట తకిట) ప్రేక్షకుల్ని అలరించాయి. వీటితో పాటు డిస్కో రాజా, మిస్ ఇండియా, సోలో బతుకే సో బెటర్, క్రాక్, టక్ జగదీశ్, పవన్ కల్యాణ్ పింక్​ రీమేక్​ లాంటి సినిమాలకు సంగీతం అందించనున్నాడు తమన్.

అనిరుధ్

తమిళ యువ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.. తమిళ అగ్రహీరోల సినిమాలకు సంగీతమందిస్తూ బిజీగా ఉన్నాడు. మాస్​ బీట్స్​తో పాటు రొమాంటిక్ పాటలను కంపోజ్ చేయడంలో అనిరుధ్​ దిట్ట. నాని హీరోగా నటించిన జెర్సీ, గ్యాంగ్‌లీడర్ చిత్రాలకు సంగీతంమందించాడు అనిరుధ్. జెర్సీ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని అదేంటో గానీ ఉన్నపాటుగా, పదే పదే, ప్రపంచమే అలా అనే పాటలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాకు వచ్చే సరికి టైటిల్ సాంగ్​తో పాటు హొయినా హొయినా పాటకు యూత్​ బాగా కనెక్ట్ అయింది.

గోపీ సుందర్

ఈ ఏడాది 'మజిలీ'తో ప్రేక్షకుల్ని మాయలో పడేశాడు గోపీసుందర్. ప్రియతమా ప్రియతమా, ఏడెత్తు మల్లేలె అనే పాటలు ప్రేమికులతో పాటు యువతను బాగా ఆకర్షించాయి.

మిక్కీ జే మేయర్

ఓ బేబీ, గద్దలకొండ గణేష్ చిత్రాలకు సంగీతం అందించాడు మిక్కీ. ఈ సినిమాల్లోని గీతాలు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఓ బేబీలో టైటిల్​ సాంగ్​తో పాటు నాలో మైమరపు అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గద్దలకొండ గణేష్ విషయానికి వస్తే ఎల్లువచ్చి గోదారమ్మ రీమేడ్​ సాంగ్​తో పాటు హే వక వక, గగన వీధిలో పాటలు యువతను మైమరిపించాయి.

విశాల్ చంద్రశేఖర్

ఈ ఏడాది పడిపడిలేచే మనసు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. ఇందులోని టైటిల్ సాంగ్​తో పాటు ఏమై పోయావే సాంగ్ యువతను ఆకట్టుకున్నాయి.

ఇవీ చూడండి.. "ఎలక్షన్‌.. ఎలక్షన్‌కి పవర్‌ కట్‌ అయిపోద్ది రా.."

ABOUT THE AUTHOR

...view details