తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆరోజు వస్తుందని అనుకోలేదు: అక్షయ్

సార్వత్రిక ఎన్నికల సమయంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పౌరసత్వం విషయంలో వివాదం చెలరేగింది. దీని గురించి, మోదీని ఇంటర్వ్యూ చేసిన విషయాల గురించి ఓ మీడియాతో మాట్లాడాడు అక్షయ్.

Akshay
అక్షయ్

By

Published : Dec 7, 2019, 9:03 AM IST

తనను తాను భారతీయుడిగా నిరూపించుకోవడానికి డాక్యుమెంట్లు చూపించాల్సిన రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. పౌరసత్వం విషయంలో రేగిన వివాదం నేపథ్యంలో భారత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశానని చెప్పాడు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో అక్షయ్‌ పౌరసత్వం విషయంలో దుమారం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని ఈ హీరో ఇంటర్వ్యూ చేయడం.. ఆ ఎన్నికల్లో తాను ఓటేయకపోవడం వల్ల పౌరసత్వం అంశం తెరపైకి వచ్చింది. 'హిందుస్థాన్‌ టైమ్స్‌' శుక్రవారం నిర్వహించిన లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో కెనడా పాస్‌పోర్టు గురించి.. అందుకు దారితీసిన పరిస్థితులు.. ప్రధాని మోదీని తాను ఇంటర్వ్యూ చేయడం తదితర అంశాల గురించి అక్షయ్‌ వివరించాడు.

"అప్పట్లో వరుసగా నా 14 సినిమాలు సరిగా ఆడలేదు. బతకడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నా. అదే సమయంలో నా స్నేహితుడొకరు కెనడా రావాలని కోరాడు. భారత్‌కు చెందిన వ్యక్తే అయినా అక్కడే స్థిరపడ్డాడు. కలిసి పనిచేద్దామని చెప్పాడు. అందుకోసం కెనడా పాస్‌పోర్ట్‌ తీసుకున్నా. సినిమా జీవితం అయిపోయింది.. మళ్లీ తిరిగి రానని అనుకున్నా. అయితే నా 15వ సినిమా విజయం అందుకోవడం వల్ల సినీ రంగంలో తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. భారత పాస్‌పోర్ట్‌ పునరుద్ధరించుకోవడం మరిచిపోయా. ఎప్పుడైతే వివాదం చెలరేగిందో అప్పుడు భారత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశా. పాస్‌పోర్టు లేని విషయాన్ని కొందరు పదే పదే ప్రస్తావించడం ఇష్టం లేక, అలాంటి వారికి మరోసారి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో నేనూ భారతీయయుడేని నిరూపించుకోవడం కోసం పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశా. నా భార్య (ట్వింకిల్‌ ఖన్నా), కొడుకు (అరవ్‌) ఇద్దరూ భారతీయులే. మా కుటుంబ సభ్యులంతా భారతీయులే. నా పన్నులన్నీ ఇక్కడే చెల్లిస్తున్నా. నా జీవితం ఇక్కడే. కానీ కొందరు ఏదేదో మాట్లాడారు."
-అక్షయ్‌ కుమార్, బాలీవుడ్ నటుడు

లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రధాని మోదీని అక్షయ్‌కుమార్‌ ఇంటర్వ్యూ చేశాడు. అయితే, మోదీని అడిగిన కొన్ని ప్రశ్నలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అక్షయ్‌ స్పందిస్తూ.. "ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసే అవకాశం అందరికీ రాదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. మోదీని ఇంటర్వ్యూ చేయడానికి నేనేమాత్రం సన్నద్ధం కాలేదు. ఓ సాధారణ వ్యక్తిని అడిగినట్లు నాకు తోచింది అడిగా. ముఖ్యంగా మామిడి పండ్ల గురించి మోదీని అడిగినప్పుడు ఆయన తన జీవితంలో వెనక్కి వెళ్లారు. అయినా విధానాల గురించో, ఇంకో వాటి గురించో అడగడం సమంజసం కాదు. ఆ పనిని జర్నలిస్టులు చేస్తున్నారు. అందుకే నేను సాధారణ ప్రశ్నలే వేశా. అందుకు ఆయన ప్రతి దానికీ ఓపిగ్గా సమాధానం చెప్పారు" అని అక్షయ్‌ వివరించాడు.

ఇవీ చూడండి.. 'మంచి కెరీర్​ కావాలంటే సల్మాన్​ను ఫాలో అవ్వండి'

ABOUT THE AUTHOR

...view details