గత కొంతకాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆటకు విరామం ప్రకటించింది. మహిళల గ్రాండ్‌ప్రి (డబ్ల్యూజీపీ) టైటిల్‌తో క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాలని భావించిన ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ హంపి సన్నాహాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. మే 2 నుంచి 15 వరకు ఇటలీలోని సార్దినియాలో చివరి డబ్ల్యూజీపీ జరగాల్సివుంది. అయితే కరోనా మహమ్మారితో ఇటలీ విలవిలలాడుతున్న నేపథ్యంలో యథాతథంగా గ్రాండ్‌ప్రి నిర్వహణ అనుమానమే. టోర్నీ వాయిదాపై ఎలాంటి సమాచారం లేకపోయినా ఇటలీ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ‘ఈనాడు’తో హంపి వివరించింది.
లాక్‌డౌన్‌తో చెస్‌కు చెక్ పెట్టిన హంపి
కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆట నుంచి విశ్రాంతి తీసుకుంటోంది గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. మే 2నుంచి 15వరకు ఇటలీ సార్దినియాలో చివరి డబ్ల్యూజీపీ జరగాల్సి ఉంది. ఆ దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. అందుకే విరామం తీసుకుంటున్నట్లు తెలిపింది.
'ఇప్పటి వరకు 3 గ్రాండ్‌ప్రి టోర్నీలు జరిగాయి. 4 టోర్నీలు ముగిశాక విజేత, రన్నరప్‌గా నిలిచిన ఇద్దరు క్రీడాకారిణులు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ర్యాంకింగ్ ఆధారంగా మరో ఆరుగురు క్రీడాకారులు ఆడతారు. వచ్చే ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జు వెంజున్ (చైనా)తో క్యాండిడేట్స్ విజేత తలపడుతుంది. ప్రస్తుతం అలెగ్జాండ్రా గోర్యషెంకోవ్ (రష్యా) 398 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 293 పాయింట్లతో నేను ద్వితీయ స్థానంలో ఉన్నా. చివరి గ్రాండ్‌ప్రిలో మూడో స్థానంలో నిలిచినా నాదే టైటిల్. అలెగ్జాండ్రా ఇప్పటికే 3 గ్రాండ్‌ప్రిలు ఆడేసింది. ఒక్కో క్రీడాకారిణి గరిష్టంగా 3 గ్రాండ్‌ప్రిలు ఆడొచ్చు. ఇటలీ గ్రాండ్‌ప్రి నాకు మూడోది. అయితే ఇటలీలో ప్రస్తుత పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా అక్కడ రోజూ వందల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. క్రీడాకారులెవరూ ఇటలీకి వెళ్లే పరిస్థితి లేదు. టోర్నీ నిర్వహించే పరిస్థితిలో ఇటలీ కూడా లేదు. వాయిదాపై ఇంకా సమాచారం లేకపోయినా షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరగడం దాదాపు అసాధ్యం. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక ఇటలీలోనో.. మరో చోటో టోర్నీ నిర్వహించొచ్చు. ఆగస్టులో చెస్ ఒలింపియాడ్, సెప్టెంబరులో ప్రపంచకప్ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ టోర్నీల నిర్వహణ కూడా కష్టమే. కొత్త తేదీలు ప్రకటించే వరకు వేచిచూస్తా. అప్పటి వరకు ఆటకు విరామం. ప్రస్తుతం విజయవాడలోని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా. ఆదివారం కంటే ముందు నుంచే మా కుటుంబం లాక్‌డౌన్ పాటిస్తోంది. బయటి వాళ్లను ఎవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లట్లేదు. ఏదీ ముట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. మనదేశంలో జనాభా ఎక్కువ. వైరస్ త్వరగా విస్తరించే ప్రమాదం అధికం. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం' అని హంపి తెలిపింది.