దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఉదయం రత్నకుమార్ మృతిచెందారు. రెండ్రోజుల క్రితం కొవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌గా తేలింది. చాలాకాలంగా కిడ్నీ సమస్య ఉండటం వల్ల ఆయనకు డయాలసిస్ చికిత్స జరుగుతోంది.
డబ్బింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు రత్నకుమార్. హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామికి ఎక్కువగా డబ్బింగ్ చెప్పారు. సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు కూడా గాత్రదానం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో మొత్తం వెయ్యికిపైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.