అమ్మ-నాన్న, అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నో బంధాలతో మనల్ని కలిపిన దేవుడు స్నేహితుడిని ఎందుకు దూరం పెట్టాడో అర్థం కాదు. ఆలోచిస్తే అది బంధం కాదు భావోద్వేగమని అర్థమౌతుంది. పరీక్షల్లో ఫెయిలైతే 'లైట్ రా' అంటూ ధైర్యం చెబుతాడు.. క్లాస్ బంక్‌లు కొట్టిస్తాడు.. భవిష్యత్తుపై భరోసానూ కలిగిస్తాడు.. అవసరమైతే కాస్త కఠినంగానూ ఉంటాడు! ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం!
ప్రేమదేశం
ఈ సినిమాలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. స్నేహానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించినపుడు వారి మధ్య తలెత్తే సంఘర్షణలు, సంఘటనలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు. 90ల్లో వచ్చిన ఈ మూవీ కళాశాల స్నేహానికి అద్దం పట్టింది. కాలేజీ స్నేహం ఎప్పటికీ అంతం కానిది అంటూ చాటి చెప్పింది. ఇందులోని పాట ముస్తఫ్పా.. ముస్తఫ్పా.. డోంట్ వర్రీ ముస్తఫ్ఫా అనే గీతం అప్పటికీ ఇప్పటికీ నిత్యనూతనమే.
నీ స్నేహం
ఈ సినిమా 2000లో విడుదలైంది. దర్శకుడు పరుచూరి మురళి. ఓ ఆటను ప్రాణం కన్న ఎక్కువగా ఇష్టపడే ఇద్దరు మిత్రుల కథ. ఓ మిత్రునికి యాక్సిడెంట్లో కాలు పోతుంది. అతడి కోరిక తీర్చడానికి ఆ ఆటలో ఛాంపియన్ అయ్యే దిశగా అడుగులు వేస్తాడు మరో మిత్రుడు. ఇదే సమయంలో వారికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. తను వారి జీవితంలో ఎలాంటి మార్పును తీసుకుని వస్తుంది. ఆ తరువాత పరిణామాలు ఏంటి అనే కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. విడుదల అయిన రోజుల్లో ప్రేక్షాభిమానుల హృదయాలును ద్రవీంపచేసిందీ చిత్రం.
స్నేహం కోసం
పది మందిలో వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెబితే.. అతడి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇదే కథాంశంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం.. 'స్నేహం కోసం'. మిత్రుడి కుటుంబం బాగుండాలని తన జీవితాన్నే త్యాగం చేస్తాడు హీరో. ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా మిత్రుడిని మిత్రుడిలా చూడాలి అనే పాఠాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ సినిమాలో చిరు నటనకు ప్రేక్షకులు దాసోహం అయిపోతారు. పతాక సన్నివేశంలో వచ్చే పాట చూసి కంటతడి పెట్టని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! అంతగా ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసేలా ఉంటుందీ సినిమా. మీసమున్న నేస్తమా.. నీకురోషమెక్కువా.. అని సాగే పాట ఆనాటి స్నేహగీతాల్లో టాప్‌గా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ కాగా.. 1999లో రిలీజైంది.
హ్యాపీడేస్
'పాదమెటుపోతున్నా.. పయనమెందాకైనా' అంటూ సాగే ఈ పాట వింటే చాలు స్నేహం విలువేంటో తెలుస్తుంది. ఈ పాటలోని 'మీరు మీరు నుంచి మన స్నేహగీతం ఏరాఏరాలోకి మారే..' అనే ఈ లిరిక్కు చాలా మంది అభిమానులు ఉన్నారంటే స్నేహం గొప్పదనం ఎంతలా వివరించారో అనేది మనం గమనించవచ్చు. ఇందుకు తగ్గట్టుగా శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని వాస్తవికానికి దగ్గరగా రూపొందించారు. దీంతో చిత్రం మరింత ఆదరణ పొందింది. మిత్రుని జీవితంలో ఉండే ఎత్తుపల్లాలను ఓ స్థాయిలో చూపించారు దర్శకుడు. ఇందులో ప్రేమ, ఆప్యాయతలను తన దైన శైలిలో రంగరించారు. ఈ సినిమా చూసే.. ఇంజినీరింగ్ కోర్సు చదివిన వారున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా యువతపై ప్రభావం చూపిందీ చిత్రం.
ఎవడే సుబ్రహ్మణ్యం
ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. విజయ్ దేవరకొండ, నాని కథానాయకులుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఒక హీరో చనిపోతాడు. అతని చివరి కోరిక ఉంటుంది. ఆ కోరికను తన భుజాల మీదకెత్తుకుండు మరో స్నేహితుడు. ఈ క్రమంలోనే దూద్ కాశీ అనే ప్రాంతానికి చేరుకోవాలని చూస్తారు. ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన జీవితం నగ్నసత్యాలు ఏంటి? అతని ప్రయాణం ఎలా సాగింది? అనుభవాలు ఏంటి? చివరకు ఏమౌతుంది? అని ఆసక్తితో సాగుతుంది ఈ చిత్రం. కేవలం మిత్రుని కోరిక తీర్చడం కోసం మరో మిత్రుడు చేసే యజ్ఞంగా ఈ సినిమాను చెప్పవచ్చు.
శంభో శివ శంభో
మిత్రుడు ప్రేమిస్తున్నాడు అని తెలియగానే ముందుగా ఆనందపడే వారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లు స్నేహితులే. వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆఖరుకు ప్రాణాలు కూడా పణంగా పెడతారు. అలాంటి కథాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకుడు. వసూళ్లపరంగా ఫర్వాలేదు అనిపించినా.. కంటెంట్‌తో మాత్రం తనదైనా మార్క్‌ను సంపాందించిందీ సినిమా.