మీరు సినిమా ప్రేమికులా? బడ్జెట్‌తో సంబంధం లేకుండా కంటెంట్‌ను మాత్రమే నమ్మి థియేటర్‌కు వెళ్తారా? అయితే మీ పంట పండినట్లే. ఎందుకంటే రేపు(శుక్రవారం) ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అభిమానులకు పాంచ్ పటాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. అందులో మూడు తెలుగు చిత్రాలు, రెండు హిందీవి. వీటిలో నితిన్ 'భీష్మ', ఆయుష్మాన్ 'శుభ్ మంగళ్' సీక్వెల్పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
'భీష్మ'తో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా?
'శ్రీనివాస కళ్యాణం' తర్వాత దాదాపు ఏడాదిన్నర విరామం తీసుకుని 'భీష్మ'తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నితిన్. ముద్దుగుమ్మ రష్మిక హీరోయిన్. ఇందులో కమర్షియల్ హంగులతో పాటు అంతర్లీనంగా కల్తీ ఎరువుల వల్ల ఏర్పడే ఇబ్బందుల గురించి చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ అలరిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా నితిన్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
భీష్మలో నితిన్-రష్మిక జోడీ దిశ మిస్సింగ్ ఆధారంగా 'వలయం'
సస్పెన్స్ కథలు బాగుంటే చాలు.. వాటిని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుటారు. ఆ కోవలోనే వస్తున్న చిత్రం 'వలయం'. లక్ష్, దిగంగన హీరోహీరోయిన్లు. తన భార్య 'దిశ' కనిపించకుండా పోతుంది. ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? ఆ తర్వాత ఏం జరిగింది? తదితర విషయాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
అమెరికా వెళ్లాలనే యువకుడి కల 'ప్రెషర్ కుక్కర్'
ఈరోజుల్లో తమ పిల్లల్ని వేరే దేశాలకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ విషయమై వారిపైన ఒత్తిడి తెస్తున్నారు. కానీ పరాయి దేశం వెళ్లాక కన్నవాళ్లకు బిడ్డలకు మధ్య ఓ తెలియని దూరం పెరుగుతోంది. ఇలాంటి సున్నితమైన అనేక అంశాల్ని ఇందులో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ ఆకట్టుకుంటుండగా, సినిమా గురించి ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు.
దెయ్యాల ఓడలో 'భూత్'
కరణ్ జోహర్ తొలిసారి నిర్మిస్తున్న హారర్ సినిమా 'భూత్: ద హంటింగ్ షిప్'. బాలీవుడ్ ప్రముఖ నటీనటులు విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ముంబయి తీరంలో ఆగిపోయిన ఓడలో కథానాయకుడికి ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్రం. మరి అభిమానుల్ని భయపెడుతుందో లేదో చూడాలి.
భూత్ సినిమాలో విక్కీ కౌశల్ ఇద్దరు అబ్బాయిల ప్రేమ.. ప్రేక్షకులకు నచ్చుతుందా?
విభిన్న కథలు విభిన్న పాత్రలతో వీక్షకుల్ని అలరించే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. గతేడాది 'డ్రీమ్‌గర్ల్', 'ఆర్టికల్ 15', 'బాలా' సినిమాలతో మెప్పించిన ఆయుష్మాన్.. ఈసారి 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'తో వస్తున్నాడు. ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటే, వారి కుటుంబాలతో పాటు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే ఇందులో చూపించనున్నారు. భారీ అంచనాలున్న నేపథ్యంలో మరి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' సినిమాలోని ఓ సన్నివేశం