బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర పరిశ్రమ వర్గాలు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. గత ఆరు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పోలీసులకు వైద్యులు సమర్పించారు. ఇందులో ఉరి వేసుకోవడం కారణంగా ఊపిరాడక సుశాంత్ మృతిచెందినట్లు తేలింది. ఇక సుశాంత్‌కు సంబంధించిన ఉదర భాగంలోని కొన్ని అవయవాలను ప్రత్యేక పరీక్షల నిమిత్తం పంపారు.
సుశాంత్ చనిపోయిన తర్వాత ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదికపై ముగ్గురు వైద్యులు సంతకం చేయగా, తుది నివేదికపై ఐదుగురు వైద్యులు సంతకం పెట్టారు. మరోవైపు డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్‌కు పోలీసులు లేఖ రాశారు. సుశాంత్ అవయవాలపై చేసే కెమికల్ పరీక్షల నివేదికలు కూడా త్వరగా సమర్పించాలని కోరారు. సుశాంత్ చనిపోయే ముందు ఆయన ఎలాంటి బాధనూ అనుభవించలేదట. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆయన గోళ్లు కూడా శుభ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనది కచ్చితంగా ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.