తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎస్బీబీ కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేద్దాం' - కమల్ హాసన్ వార్తలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన అందరితో పాటు సంగీత ప్రియులూ నేడు సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరుతున్నారు.

'ఎస్బీబీ కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేద్దాం'
'ఎస్బీబీ కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేద్దాం'

By

Published : Aug 20, 2020, 7:28 AM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కాగా.. ఎస్పీబీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన అందరితోపాటు సంగీతప్రియులూ నేడు సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరుతున్నారు. ప్రముఖ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌; దర్శకుడు భారతీరాజా; సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌; రచయిత వైరముత్తు కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు.

"సినీరంగానికి చెందిన వారికి, సంగీత ప్రియులకు మాదో విన్నపం. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని మనమంతా ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలు చేద్దాం. ఎవరికి వారు తమ ఇంట్లోనే ఉండి.. ఎస్పీ బాలు పాడిన పాటలను ప్లే చేయాలి. ఆయన గాత్రం మనం మళ్లీ వినేలా చేసుకోవాల" అని ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే దర్శకుడు భారతీరాజా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. "బాలు.. భాషలకతీతంగా యాభై ఏళ్లుగా తన గాత్రంతో మనల్ని మైమరపిస్తున్న గాయకుడు. ఆయన కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసి ప్రపంచంలోని సంగీతప్రియులందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బాలు.. కళాకారుల్లో ఓ ఉత్తమ సంస్కారి. ప్రేమని పంచడం మాత్రమే తెలిసిన మంచివాడు. అంతటి ఉన్నత కళాకారుణ్ణి మనం కాపాడుకోవాలి. అతను తిరిగిరావాలి. ఇళయరాజా, కమల్‌హాసన్, రజనీకాంత్, ఏఆర్‌ రెహమాన్‌తో‌పాటూ తమిళపరిశ్రమకి చెందిన కళాకారులూ, కార్మికులందరం రేపు సాయంత్రం 6 గంటలకు నిమిషం పాటు ప్రార్థన చేయబోతున్నాం. అతణ్ణి రక్షించాలని ప్రకృతి తల్లిని అర్థించబోతున్నాం. మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా ఎన్నో భాషల ప్రేక్షకుల్ని బాలు తన గానంతో రంజింపజేశాడు. ఆ భాషల వాళ్లందరూ ఇందులో పాల్గొనాలన్నది నా వినతి! నిస్వార్థమైన ప్రార్థన ఏ అద్భుతమైనా చేస్తుంది. కాబట్టి.. అందరూ నిమిషం పాటు మాతో పార్థనలో పాల్గొనండి!" అని భారతీరాజా సందేశం ఇచ్చారు.

ఎస్పీ బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ తెలుగు సినీ సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌, గాయని విజయలక్ష్మి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం పలువురు మ్యూజిషియన్స్‌ ఎవరికివారు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించారు. పలువురు ప్రముఖులు ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను, చిత్రాలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details