తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుమక్క'.. యాంకరింగ్​లో నిన్ను దాటాలంటే చాలా కష్టం! - సుమ లైఫ్ స్టోరీ

కేరళ పుట్టి.. యాంకరింగ్​తో తెలుగు వాళ్లకు దగ్గరై.. ఆ తర్వాత తెలుగింటి కోడలై ఎంతోమంది అభిమానుల మనసుల్లో చోటు సంపాదించిన సుమ కనకాల పుట్టినరోజు నేడు(మార్చి 22). ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు మీకోసం.

suma birthday
యాంకర్ సుమ

By

Published : Mar 22, 2021, 8:46 AM IST

తన మాటలతో, చలాకీతనంతో అంతకు మించిన సమయస్ఫూర్తితో టెలివిజన్‌ షోలను, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లను రక్తి కట్టించే వ్యాఖ్యాత సుమ. బుల్లితెరపై ఆమె కార్యక్రమం మొదలైందంటే, ముగిసే వరకూ మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. సోమవారం(మార్చి 22) 47వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించిన ఆసక్తికర విషయాలు ఆమె మాటాల్లోనే..

ఇందులో భాగంగా తన యాంకరింగ్ ప్రస్థానం ఎలా మొదలైంది? తొలిసారి యాంకరింగ్‌ చేసిన కార్యక్రమం ఏంటి? ఇలా ఎన్నో విశేషాలను పంచుకున్నారు.

యాంకర్ సుమ

యాంకర్‌గా సుమ చేసిన మొదటి షో అదేనట!

"ఇన్ని షోలు చేసేస్తోంది.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లు చేస్తోంది. ఇదంతా ఎక్కడ మొదలైందన్న' అనుమానం తప్పకుండా వస్తుంది. అందుకు పునాది నా డ్యాన్స్‌.. సీరియల్స్‌.. స్టేజ్‌ ప్రోగ్రాంలు. నేను మొదటిసారి చేసిన స్టేజ్‌ ప్లే పేరు 'పుత్రకామేష్టి'. దాని తెలుగు పేరు కొడుకు పుట్టాలి. అందులో కొరలమ్మ పాత్ర పోషించా. దిల్లీ, కోల్‌కతాలలో ఆలిండియా రైల్వేస్‌ నిర్వహించిన కార్యక్రమంలో నాకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. నా జ్ఞాపకశక్తికి మరింత పదును పెట్టడానికి నాటకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి"

"నేను కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సమయంలో యాంకరింగ్‌ అన్న పదమే లేదు. అనౌన్సర్లు ఉండేవారు. దూరదర్శన్‌లో కార్యక్రమాలు చేస్తుండగా 'ఇక్కడ మాట్లాడాలమ్మా..' అని చెప్పేవారు. అంతే తప్ప 'మీరు యాంకరింగ్‌ చేయాలి' అని చెప్పేవారే కాదు. నా యాంకరింగ్‌కు స్ఫూర్తి ఎవరన్న విషయం తెలియకుండా వరుసగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. అలా ఈ వృత్తిలో స్థిరపడిపోయాను"

కెరీర్​ ప్రారంభంలో సుమ

"ఇప్పుడు యాంకరింగ్‌ చేసేవాళ్ల కోసం అనేక రకాల మైక్‌లు వచ్చేశాయి. కానీ, అప్పుడు యాంకరింగ్‌ చేసేవాళ్లు ఆ తర్వాత డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చేది. ఆ కష్టమేంటో మాకు మాత్రమే తెలుసు"

"మొదటిసారి నేను యాంకరింగ్‌ చేసిన లేదా ఫిల్మ్‌ బేస్డ్‌ ప్రోగ్రాం అంటే త్రీస్టార్‌ ఎలక్ట్రానిక్స్‌ అనే స్టూడియోలో దూరదర్శన్‌ వారి కోసం షూట్‌ చేశారు. బహుశా మీర్‌గారు దానికి దర్శకత్వం వహించినట్లు గుర్తు. నేను తెలుగులో ఇంత చక్కగా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం.. నేను పనిచేసిన టెక్నీషియన్లు, దర్శకులు, రచయితలు కెమెరామెన్లు. వారు నాకు ఎంతో సహకరించారు. అందులో మీర్‌గారిది చాలా ముఖ్యమైన పాత్ర. ప్రదీప్‌గారు, రామ్‌ప్రసాద్‌గారు ఇలా ఎంతోమంది సహకారం మర్చిపోలేనిది. మొదట్లో నాకు 'బాధ' అనే పదం కూడా పలకడం వచ్చేది కాదు. 'బాద.. బాద..' అని పలికేదాన్ని 'బాధ' అని పలకాలి అని చెప్పి నేర్పించారు."

"ఆ తర్వాత ఏషియానెట్‌ ఛానల్‌ మలయాళంలో వచ్చింది, దానిలో 2 గంటలు తెలుగు కార్యక్రమం టెలికాస్ట్‌కు సమయం దొరకడం వల్ల మోహన్‌గారు, హేమంత్‌, గీత, అను వీళ్లంతా చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసేవారు. ఎక్కడెక్కడ ఏం వస్తువులు దొరుకుతాయో చెప్పే కార్యక్రమం అది. ఆ తర్వాత జయ, పుష్ప, నన్నూ కలిపి ఫిల్మ్‌ బేస్డ్‌ కార్యక్రమానికి సంబంధించి బిట్స్‌ తీసుకున్నారు. పాటలతో పాటు ఆ వీడియోను టెలికాస్ట్‌ చేసేవారు. ఇవన్నీ శాటిలైట్‌ ఛానల్స్‌ రాకముందు చేసిన యాంకరింగ్‌ కార్యక్రమాలు"

కెరీర్​ ప్రారంభంలో సుమ

"అప్పటికే ఉత్తరాదిన యాంకర్లు, హోస్ట్‌లు, వీజేలు అన్న మాటలు వినిపిస్తూ ఉండేవి. ఇక్కడకు కూడా వాటిని తీసుకొచ్చారు. జెమినీలో నేను యాంకరింగ్‌ చేసిన మొదటి కార్యక్రమం 'వన్స్‌ మోర్‌ ప్లీజ్‌'. సరైన యాంకరింగ్‌ షో అంటే ఇదేనని అనే చెప్పాలి. ఈ షోకు కూడా డబ్బింగ్‌ చెప్పేదాన్ని. అలాగే దూరదర్శన్‌ కోసం ఒక క్విజ్‌ బేస్డ్‌ షో చేశాం. దానిలో క్విజ్‌ మాస్టర్‌ అచ్యుత్‌గారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం నుంచి తప్పుకొన్నా. నా స్థానంలోకి ఝాన్సీ వచ్చింది"

"ఆ తర్వాత జెమినీ టీవీలో 'టాప్‌ ఆఫ్‌ ది టాప్స్‌' కార్యక్రమం చేశా. ఈ షోలో విభిన్న గెటప్‌లు వేయడం అలవాటైంది. వివిధ యాసలు మాట్లాడటం నేర్చుకున్నా. ఈ సమయంలోనే రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. దర్శకరత్న దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో 'కల్యాణ ప్రాప్తిరస్తు' చేశా. అలాగే మలయాళంలో మూడు సినిమాలు చేశా. కానీ, నాకు బుల్లితెరపై నటించడమే అనుకూలంగా అనిపించింది. దాంతో మళ్లీ ఇటువైపు వచ్చేశా"

కెరీర్​ ప్రారంభంలో సుమ

"అప్పుడు జెమినీ టీవీలో ఒక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించా. అందులో సరైన మైక్‌లు వాడుతూ, డబ్బింగ్‌ లేకుండా ఆడియన్స్‌ మధ్యలో చేసిన కార్యక్రమం 'అంత్యాక్షరి'. నేనూ, సంగీత దర్శకుడు శ్రీ కలిసి హోస్ట్‌లుగా చేశాం. మంచి ప్రజాదరణ వచ్చింది. ఆ తర్వాత ఈటీవీలో 'కోకాకోలా హంగామా' షో కూడా చేశా. దీనికి కూడా మంచి పేరు తెచ్చింది"

"జెమినీ, ఈటీవీ తర్వాత నాకు మంచి పేరు తెచ్చింది మాటీవీ. అందులో 'యురేకా కసామిసా' షో చేశా. అలాగే 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమం కూడా చేశా. దాదాపు 72 ఎపిసోడ్‌లు చేశాం. ఆ తర్వాత నాకు బాగా పాపులారిటీ తెచ్చిన షో 'అవాక్కయ్యారా!'. నా కెరీర్‌లో ఇది పెద్ద మైలురాయి. ఈ షోకు అంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. ఈ షో తర్వాత నేను వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది"

'స్టార్ మహిళ' యాంకర్ సుమ

"నా కెరీర్‌లో చేసిన అతిపెద్ద లేడీస్‌ గేమ్‌ షో 'మహిళలూ.. మహారాణులు'.. ఇదే ఆ తర్వాత 'స్టార్‌ మహిళ'గా ఆవిర్భవించింది. 12ఏళ్లు నడిచిన ఏకైక మహిళా ప్రోగ్రాంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను సొంతం చేసుకుంది. 'ఇన్నేళ్లు ఒక షో ఎలా చేశావ్‌. విసగనిపించలేదా? సుమ' అని అడిగేవారు. నా జీవితం నాకు నేర్పిన పాఠం ఏంటంటే.. నేను ఏ కార్యక్రమం చేసినా, నా మనసు ఆ కార్యక్రమం మీద మాత్రమే పెట్టి చేస్తా. మన మనసు వేరే చోట ఉంటే ఎప్పటికీ సక్సెస్‌ కాలేం. ఒక యాంకర్‌కు కావాల్సింది ఇదే"

"ఆ తర్వాత మార్కెట్‌లోకి ఎన్నో రకాల గేమ్‌ షోలు వచ్చాయి. ఆసక్తికర గేమ్‌ షోలు తీసుకొచ్చిన ఘనత మాత్రం మల్లెమాల వాళ్లకు చెందుతుంది. వాళ్లు 'జీన్స్‌', 'క్యాష్‌'లాంటి ఆసక్తికర షోలు తీసుకొచ్చారు. ఇప్పటికీ 'క్యాష్‌' యువతరాన్ని అలరించేలా సాగుతోంది. నాకు నచ్చిన మరో షో 'పంచావతారం' టీవీ9లో చేసేదాన్ని. 'భలే ఛాన్సులే' కూడా చిన్నారులను, పెద్దలను అలరించేది. ప్రస్తుతం పలు షోలతో పాటు అనేక ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లు చేస్తున్నా. బహుశా ఇప్పటివరకూ దాదాపు 200లకు పైగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లు చేసి ఉంటాను" అని సుమ తన యాంకరింగ్​ కెరీర్​ గురించి చెప్పుకొచ్చారు.

క్యాష్ షోలో సుమ

ABOUT THE AUTHOR

...view details