ఆ వాద్యం హృద్యం. రసికజన నైవేద్యం. గుండెల్లో మార్మోగే సంగీత నాదం. ఆ వాద్యం వింటుంటే.. శ్రోతలు పూనకాలతో ఊగిపోతారు. సర్వం మరిచి స్వర్గసీమలో తేలియాడుతారు. మెస్మరైజ్ చేసే ఆ వాద్య రసధునిలో తలారా స్నానిస్తారు. శిశుర్వేత్తి... పశుర్వేత్తి... అన్న ఆర్యోక్తికి అసలు సిసలైన సంగీతానువాదం ఆయన శైలి. ఆయనే 'డ్రమ్స్ శివమణి'. డ్రమ్స్, ఆక్టోబాన్, దర్బుకా, ఉడుకాయి, కంజరలతో పాటు మరికొన్ని సంగీత వాద్యాలను వాయిస్తారు. మంగళవారం(డిసెంబరు 1) ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు మీ కోసం
ఐపీఎల్ ద్వారా గుర్తింపు
2008, 2010 ఐపీఎల్‌లో శివమణి డ్రమ్స్ వాయించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈయనకు అనుబంధం ఉంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సారథ్యంలో సంగీత సాధనాలు వాయించినందుకు శివమణికి ఎక్కువ గుర్తింపు లభించింది. ఏఆర్ రెహమాన్, శివమణి చిన్ననాటి స్నేహితులు.
కుటుంబ నేపథ్యం
శివమణి చెన్నైకి చెందినవారు. ఏడు సంవత్సరాల నుంచే డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టారు. 11 ఏళ్ల నుంచి సంగీతాన్ని వృత్తిగా స్వీకరించారు. ఆ తర్వాత ముంబయికి మకాం మార్చారు. నోయెల్ గ్రాంట్, బిల్లే కోభామ్‌ల నుంచి స్ఫూర్తి పొందారు. ఎం.ఎస్.విశ్వనాథన్, ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్ తదితరులతో కలిసి పనిచేశారు. 1990లో బిల్లే కోభామ్‌తో ముంబయిలోని రంగ్ భవన్ వేదికను పంచుకున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు గాడ్ ఫాదర్ అని మణి చెబుతుంటారు.
కర్ణాటక సంగీతంలోనూ అసమాన ప్రతిభ
కర్ణాటక సంగీత విద్వాంసులు కున్నాకుడి వైద్యనాథన్, టీవీ గోపాల్‌కృష్ణన్, వల్లీయాపట్టి సుబ్రమణ్యం, పళణివేల్, ఎల్.శంకర్‌లతో మొదట సంగీత ప్రయోగాలను చేసేవారు శివమణి. కెరీర్ తొలి దశలో కోలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడైన టీ రాజేందర్‌తో చాలాసార్లు పనిచేశారు. ముంబయిలో కచేరీలో తబలా విద్యాంసుడు జాకీర్ హుస్సేన్ తనతో త్రిలోక్ గుర్తుతో వేదికను పంచుకోవాలని ఆహ్వానించారు. అప్పటి నుంచి శివమణి లూయిస్ బ్యాంక్స్‌తో సహా ఎందరో సంగీత విద్వాంసులతో కలిసి పనిచేశారు.
ఏ.ఆర్.రెహమాన్‌తో కలిసి ఎన్నో ప్రపంచస్థాయి ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనతో కలిసి 'బొంబాయి డ్రీమ్స్'కు పని చేశారు. శ్రద్ధా సంగీత బృందంలో శివమణి భాగస్వాములు. ఈ బృందంలో శంకర్ మహదేవన్, హరిహరన్, యూ.శ్రీనివాస్, లాయ్ మెన్డోన్సాలు ఉన్నారు.
ఏషియా ఎలెక్ట్రిక్ బ్యాండ్ వ్యవస్థాపకుడు