హేమమాలిని చక్రవర్తి అభిమానుల కలల రాగిణి. 1948 అక్టోబరు 16న జన్మించిన ఈమె ఎప్పటికీ అభిమానుల డ్రీమ్‌గర్ల్. హేమా తన ఇద్దరు కూతుళ్లతో కలసి భరతనాట్యప్రదర్శన ఇస్తుంటే తల్లి ఇద్దరు కూతుళ్లలాగా ఉండరు.. ముగ్గురు అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. అంతటి ఎవర్‌గ్రీన్ ఛార్మింగ్ ఈ బ్యూటీ. తమిళనాడు ఊటీకి దగ్గరలో వున్న అమ్మన్‌కుడిలో సనాతన అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రామానుజ చక్రవర్తి, జయా చక్రవర్తిలకు 1948లో హేమమాలిని పుట్టింది. ఇద్దరు అన్నదమ్ములకు ముద్దుల చెల్లెలు హేమ. తల్లి జయకు సినీరంగంతో పరిచయాలు ఎక్కువ. మద్రాసులో మకాం ఉండటం వల్ల ఆంధ్ర మహిళ సభలో హేమ చదువుకుంది. కానీ నాట్యకళ మీద ఉన్న మక్కువతో పదో తరగతిలోనే చదువుకు స్వస్తి పలికింది. భరతనాట్య కళలో మెలకువలకు పదును పెట్టుకుంది.
1963లో తమిళ సినిమా "ఇదు సత్తియం" సినిమాలో మొదటిసారిగా వెండితెరపై తళుక్కుమన్న బంగారు భామ హేమ, "పింజారె తేరిక్కి చేరికట్టి " పాటలో బృంద నృత్యంలో నర్తించింది. అదే ఆమె తెరంగ్రేటం అని చెప్పవచ్చు. పెద్ద టీ ఎస్టేట్ లొకేషన్‌లో కనిపించిన ఈ సుందరాంగి మొదటి ఫ్రేమ్‌లోనే తన సొట్టబుగ్గలతో అందర్ని ఆకట్టుకుంది.
అఖిల భారత స్థాయిలో డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హేమమాలిని తెలుగులో రెండు చిత్రాలలో నటించగా అవి రెండూ ఎన్టీఆర్ చిత్రాలే కావడం విశేషం. ఆమె తొలి తెలుగు సినిమా 'పాండవ వనవాసం'. 1964లో దర్శకుడు శ్రీధర్, 'వెన్నీరాడై' సినిమాకోసం కొత్త తారను పరిచయం చెయ్యాలని హేమమాలినికి స్క్రీన్ టెస్టు చేశారు. కానీ, హేమ చాలా సన్నగా ఉండడం వల్ల ఆ పాత్ర దక్కలేదు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన 'పాండవ వనవాసము' సినిమాలో దుర్యోధనుడు ఘోష యాత్రకోసం అడవికి వచ్చినప్పుడు వచ్చే నృత్య సన్నివేశంలో "మొగలిరేకుల సిగ దానా, మురిడీ గొలుసుల చినదానా" అనే పాటలో నృత్య దర్శకుడు కె ఎస్ రెడ్డి తో నర్తించారు.
ఆ తర్వాతి కాలంలో దిల్లీలో ఉన్న హేమను కమలాకర కామేశ్వరరావు మద్రాసుకు పిలిపించి 'శ్రీ కృష్ణ విజయము' సినిమాలో రంభ పాత్రలో అతిధిగా నటింపజేసి "జోహారు శిఖిపించమౌళీ.. ఇదే జోహారు రసరమ్య గుణశాలి, వనమాలి" పాటకు నాట్యం చేయించారు. తేనె మనసులు చిత్రంలో నాయిక పాత్ర కోసం ఆమె దరఖాస్తు చేసుకుంటే ఆదుర్తి తీసుకోలేదు. కానీ కమలాకర కామేశ్వరరావు తెలుగు చలన చిత్ర రంగానికి ఆమెను పరిచయం చేసిన ఘనతను సముపార్జించుకోగలిగారు.
1968లో మద్రాసుకు చెందిన బి.అనంతస్వామి అనే లాయర్ నిర్మాతగా మారి హిందీలో ‘సప్నోంకా సౌదాగర్’ అనే సినిమా ప్లాన్ చేశారు. షో మేన్ రాజ్‌కపూర్ ప్రధాన పాత్రధారి. అందులో హేమది 'మహి' అనే బంజారా యువతి పాత్ర. కలల వ్యాపారి 'సప్నోంకా సౌదాగర్' సినిమాలో తనూజ, నదీరా కూడా నటించారు. మహేష్ కౌల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఠాకూర్ రాయ్‌బహద్దూర్ హర్నామ్ సింగ్ అనే జమీందారు కథ. 18 ఏళ్లక్రితం ఆ జమీందారుగారి ఏడాది పాపను ఓ బంజారా వ్యక్తి ఎత్తుకుపోయిన సన్నివేశం ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలవుతుంది. హేమమాలినియే ఆ బాలిక. బంజారా యువతిగా పెరిగిందనేది కథాంశం. రాజ్‌కపూర్, అతనితో ప్రేమలో పడిన మహిళలు కలసి పాడే డ్యూయెట్ ఈ "ప్యార్‌సే దేఖో హమ్ భీ ప్యార్‌సే దేఖేంగే" పాట. ఈ సినిమా నిర్మాత అనంతస్వామి తెలివిగా హేమమాలిని చేత ఒక కాంట్రాక్టు పత్రాన్ని రాయించుకున్నారు. హేమతో సినిమా తీయాలనుకునే ఏ నిర్మాతైనా అనంతస్వామి అనుమతి తీసుకోవాలని, కాల్షీట్లు దగ్గర నుంచి, పారితోషికం వరకు అతడే నిర్ణయించాలని ఆ అగ్రిమెంట్ సారాంశం. ఆ చక్రబంధం నుంచి బయటపడేందుకు హేమమాలిని ఎన్నో వ్యయప్రయాసలకోర్చారు. తరువాత ఆమె వ్యవహారాలన్నీ తల్లి జయాచక్రవర్తి స్వయంగా చూసుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత కాలంలో హేమ నటించిన సినిమాలు 'జహా ప్యార్ మిలే', 'వారిస్', 'ఆంసూ అవుర్ ముస్కాన్' సినిమాలు హిట్ కాకపోయినా బాగా ఆడాయి.
1970వ సంవత్సరం వచ్చిన 'జానీ మేరా నామ్' సూపర్ హిట్‌గా నిలిచి ఆమెను డ్రీంగర్ల్‌గా మార్చివేసింది. 1971లో వచ్చిన 'అందాజ్'. 'లాల్ పత్తర్’', 'తేరే మేరే సప్నే' సినిమాలు విజయవంతం కావడం వల్ల హేమ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1972లో ద్విపాత్రాభినయం చేసిన 'సీతా అవుర్ గీత' సినిమా ఆమెను శిఖరాగ్రంపై కూర్చోబెట్టింది.
హేమమాలిని తండ్రి సంప్రదాయాలను, కట్టుబాట్లను గౌరవించే వ్యక్తి. హేమంటే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. 'డ్రీమ్‌గర్ల్'గా గుర్తింపు రావడం వల్ల ఆమె ప్రేమలో పడకుండా తల్లి జయ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ధర్మేంద్ర , జితేంద్ర, సంజీవ్ కుమార్ వంటి సెలబ్రిటీలు హేమమాలినిపై మనసు పడ్డారు. ధర్మేంద్ర అప్పటికే వివాహితుడైనా.. ఎందుకో ఆయన్నే హేమ ఇష్టపడ్డారు. తండ్రి ఆకస్మిక మరణం తరువాత హేమ, ధర్మేంద్రనే వివాహమాడారు. ధర్మేంద్ర కాంబినేషన్లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది.. వారిద్దరి సినిమాలు బాక్సాఫీసు హిట్లు అయ్యాయి.
ధర్మేంద్ర సరసన నటించిన తొలి సినిమా ‘తుమ్ హసీన్ మై జవాన్’ బాక్సాఫీసు హిట్టయింది. ఆ తర్వాత వరుసగా ధర్మేంద్రతో 'రాజా జానీ', 'షరాఫత్' సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచి, వారిద్దరినీ చూడముచ్చటైన జంటగా మార్చేశాయి. ధర్మేంద్రతోనే కాక ఇతర అగ్రస్థాయి హీరోలు చాలామంది హేమమాలి సరసన నటించారు.