'కళ్లు.. కళ్లూ ప్లస్సు.. వాళ్లు వీళ్లు మైనస్’ అంటూ సినిమా పాటలకు లెక్కల సూత్రాలు బోధించిన మాస్టారాయన. విలన్ పరిగెత్తే వేగానికి.. వాడు కింద పడాలంటే ఎన్ని డిగ్రీల కోణంలో వస్తువు విసరాలో చెప్పి.. ఫైట్లలో భౌతికశాస్త్రాన్ని చొప్పించిన గురువాయన. సన్నివేశాల్లో రసాయన శాస్త్రాన్ని.. మాస్ డైలాగుల్లో తత్వ శాస్త్రాన్ని చెప్పగల లెక్చరరాయన. 'పుష్ప'తో తెలుగు కథను పాన్‌ఇండియా స్థాయిలో చెప్పి మెప్పించారాయన. ఆ విజయానందంలో ఈసారి సంక్రాంతి జరుపుకోనున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా పలుకరించింది. తన జీవితంలోని మూడు దశల్లో ముఖ్యమైన సంక్రాంతుల గురించి చెప్పమని కోరింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
Sankranti festival: "సంక్రాంతికి మా ప్రాంతంలో మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది. మనిషికి మనిషి కన్పించనంతగా పొగమంచు. భలే ఉండేది ఆ వాతావరణం. మా పెద్దక్క నలుగుపిండి పెట్టి, కుంకుడు పోసి.. బాగా స్నానం చేయించేది. ఏడ్చినా వదిలిపెట్టేది కాదు. మా నాన్న (తిరుపతి నాయుడు) అందరికీ కొత్త బట్టలు కుట్టించేవాడు. మా నాన్న ఫ్రెండే టైలర్. ఆయన పేరు చిన్నంశెట్టి. ఒకే రంగు క్లాత్ తెచ్చి అందరికీ నిక్కరు, షర్టులు.. మా ఇంటి దగ్గరే టైలర్లు మిషన్లు పెట్టేవారు. ఉదయాన్నే కొత్త బట్టలు కట్టుకొని.. పొగమంచులో పరిగెత్తుతూ భలే ఆడుకునే వాళ్లం. నాకు ఇష్టమని అమ్మ(వీర వేణి) బూరెలు చేసేది. అందులోని పూర్ణం అంటే ఇంకా ఇష్టం. నాకోసం దాన్ని అమ్మ పక్కకు తీసి ఉంచేది.
* ఇంటి ముందు అలకడానికి, గొబ్బెమ్మలు చేయడానికి ఆవు పేడ తీసుకురావడం అనేది పెద్ద పని. గేదె పేడ వాడేవారు కాదు. ఆవు పేడ కిందపడకుండా పట్టుకురావాలి. తట్టలు పట్టుకొని ఆవుల వెనుకే తిరిగేవాళ్లం. ఇది భలే తమాషాగా ఉండేది.
* ఇంకా సంక్రాంతి అంటే నాకు బాగా గుర్తొచ్చేది శివకోడు ముసలమ్మ తీర్థం. అది పెద్ద సంత అన్నమాట. అక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మల దగ్గర నుంచి ఆడపిల్లలకు, ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు, వ్యవసాయ పరికరాలు ఇలా.. అన్నీ అమ్మేవారు. అక్కడ మా పెద్దనాన్న మిఠాయి కొట్టు పెట్టేవారు. మా పెద్దనాన్న పేరు వెంకటరత్నం. ఇంకో పెద్దనాన్న సూర్రావు. చిన్న పెద్దనాన్నకు ఊర్లో కొట్టు ఉండేది. అందుకు ఆయన్ను కొట్టునాన్న అనే వాళ్లం. వెంకటరత్నం పెద్దనాన్న నడిపే మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్లే వాళ్లం. అక్కడ జీడి పాకం బాగుంటుంది. మా సూర్రావు పెద్దనాన్న.. వెంకటరత్నం పెద్దనాన్నకు తెలియకుండా జీడిపాకం ఇచ్చేవారు. మేం దాన్ని తీసుకొని పక్కకు వెళ్లి తినేసేవాళ్లం. తీర్థంలో పెద్ద నాటక సంస్థలు వచ్చి నాటకాలు ఆడేవారు. కనుమ రోజు రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టేవారు.
* తీర్థంలో ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులిస్తే.. తను తక్కువ ఉపయోగించుకొని, అందులో ఎక్కువ నాకే ఇచ్చేది మా చిన్నక్క. మా అమ్మకు పకోడి, ఖర్జూర పళ్లంటే ఇష్టం. ఆ రెండు కొనుక్కొని అమ్మకు ఇచ్చేవాడిని. పాకుండలు అనే ఒక మిఠాయి లాంటిది తయారుచేసేవాళ్లు. నెల రోజుల పాటు నిల్వ ఉండేవి. అవి ఎక్కువగా తినేవాళ్లం. పోయిన వస్తువులు దొరకాలని ముసలమ్మకు మొక్కుకొనే వాళ్లం. పెన్నులు, నోట్స్‌లు, పెన్సిళ్లు.. ఇలాంటివి అన్నమాట. అదో నమ్మకం. అవి తిరిగి దొరికితే.. అమ్మకు 5 పైసలు.. అలా హుండీలో వేస్తామని మొక్కుకొనేవాళ్లం.