ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే తనకు లేదని అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కాబట్టి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదని తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన గతకొన్నిరోజుల నుంచి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు సంధిస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రారంభం కానున్న స్పార్క్ ఓటీటీ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.
రాజకీయాల్లోకి రాను.. ఆ ఉద్దేశం అస్సలు లేదు: ఆర్జీవీ - RGV POLITICAL ENTRY
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. రాజకీయాల్లోకి వస్తారా? దీనికి ఆయనే స్వయంగా సమాధానం చెప్పారు. అలానే 'స్పార్క్' ఓటీటీలో రానున్న చిత్రాల గురించి మాట్లాడారు.
రాజకీయ నాయకులపై ఎప్పటికప్పుడు పవర్‌ఫుల్ సెటైర్లు వేస్తున్న మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని విలేకరి ప్రశ్నించగా.. "నో. నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే పొలిటిక్స్‌లోకి వస్తారు. అది నేను కాదు. సహజంగా ఏ నేత అయినా ఫేమ్, పవర్ కోసమే పొలిటిక్స్‌లోకి అడుగుపెడతాడు. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ప్రజాసేవ అని పైకి చెబుతుంటాడు" అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.
అనంతరం స్పార్క్ ఓటీటీలో విడుదల కానున్న సినిమాల గురించి స్పందిస్తూ.. "ఓటీటీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకు ఎంతగానో చేరువకానుంది. నాకు తెలిసిన ఓ వ్యక్తితో కలిసిన ఓటీటీని ప్రారంభిస్తున్నాం. మే 15న అది ప్రారంభం కానుంది. ఇందులో అన్నిరకాల కథాచిత్రాలు అందుబాటులో ఉంటాయి. దావూద్ ఇబ్రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన 'డీ కంపెనీ'ని దీనిలోనే విడుదల చేయనున్నాం. అతని జీవితాన్ని కొన్ని గంటల్లో సినిమాగా చూపించడం కొంతమేర కష్టమే అందుకే వెబ్‌సిరీస్‌గా తీసుకురానున్నాం. ఇప్పుడు విడుదల కానున్న 'డీ కంపెనీ' వెబ్‌సిరీస్ మొదటి పార్ట్‌గా భావించవచ్చు' అని ఆర్జీవీ పేర్కొన్నారు.