ఆయన ప్రపంచం సినిమా. ఆయన 'గమ్యం' సినిమా. ఆయన నిత్యపారాయణ గ్రంథం సినీ 'వేదం'. తీసిన ప్రతి సినిమా ఓ ఆణిముత్యం. అటు ఇండస్ట్రీ పెద్దల్ని, ఇటు ప్రేక్షకులని విస్మయానందానికి గురిచేస్తూ.. దశాబ్దాల పాటు స్మరించుకునే సృజనాత్మక దర్శకుడిగా ఆయన తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు ఎన్నటికీ వన్నె తగ్గనివి. ఆయనే క్రిష్. పూర్తి పేరు రాధాకృష్ణ జాగర్లమూడి.
1976 నవంబర్ 10న ఆంధ్రప్రదేశ్ గుంటూరులో క్రిష్ పుట్టి పెరిగారు. సినిమాయే ఆశగా, శ్వాసగా.. అదే తన గమ్యంగా నిర్దేశించుకున్నారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి కొన్ని సూపర్ హిట్ సినిమాలు తీసి సత్తా చాటారు.
వైవిధ్యమైన ఇతివృత్తాలు, కొన్ని భావోద్వేగాలు, కించిత్ తాత్వికతతో కూడిన ఆయన చిత్రాలు కేవలం మేధావులనే కాదు... సామాన్య ప్రేక్షకులనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2008లో పరిశ్రమలోకి అడుగుపెట్టి వైవిధ్యభరిత సినిమాలు తీస్తూ విజయాలతో పాటు కొన్ని వివాదాల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు.
తండ్రి ద్వారా చిత్రసీమలోకి ప్రవేశం
ఎంతో మంది నిర్మాతలను కలసి 'గమ్యం' కథ చెప్పి కన్విన్స్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. క్రిష్‌ని చిత్రసీమకి పరిచయం చేసింది ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబా, బాబాయ్ బిబో శ్రీనివాస్. ఈ ఇద్దరితో పాటు క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు.
అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ తదితర తారాగణంతో తెరకెక్కిన 'గమ్యం' సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. విమర్శకుల ప్రశంసలూ అందుకుందీ చిత్రం. సినీ పరిశ్రమకు అభిరుచిగల దర్శకుడు లభించాడన్న భరోసా అందించింది. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు గెలుచుకుంది. 2009లో ఈ సినిమాకి సౌత్ ఫిలింఫేర్ ద్వారా ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సినిమాగా అవార్డులను సొంతం చేసుకుంది.
తెలుగులో ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. ఆ తర్వాత క్రిష్ నుంచి వచ్చే సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా 'వేదం' వచ్చింది. 2010లో విడుదలైన ఈ సినిమాలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషించారు.
సుమారు దశాబ్దం తర్వాత తెలుగులో విడుదలైన మల్టీస్టారర్ మూవీగా ఈ చిత్రం పేరు తెచ్చుకుంది. దీంతో రెండోసారి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు క్రిష్. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అనుష్క శెట్టి అవార్డులు గెలుచుకున్నారు.
తమిళంలో 'వానం'