రాజ్, సిమ్రాన్ల ప్రేమ కావ్యానికి రూపం.. 'దిల్వాలే దుల్హానియా లేజాయేంగే'. షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ చిత్రం.. నేటితో పాతిక వసంతాలను పూర్తి చేసుకుంది. బాలీవుడ్ ప్రేమకథల్లో చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఓ సాధారణ చిత్రంలో నటిస్తున్నానని మాత్రమే అనుకున్నానని చెప్పింది నటి కాజోల్. కానీ, ఇంతటి స్థాయిలో నిలుస్తుందని ఊహించలేదని తెలిపింది. కాలాతీతంగా నిలిచిపోయే చిత్రం 'డీడీఎల్జే' అని ఆమె చెబుతోంది.
"డీడీఎల్జే కాలాతీతంగా నిలిచిపోయే చిత్రం. ఎందుకంటే.. ప్రతిఒక్కరూ ఏదో ఒక చోట రాజ్, సిమ్రాన్ పాత్రలలో తమని తాము ఊహించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆ పాత్రలను అందరూ ఇష్టపడుతున్నారు. బహుశా ఇక ముందూ ఇష్టపడుతూనే ఉంటారు. మనలో చాలా మందిలో సిమ్రాన్ అనే ఓ పాత్ర ఉంటుంది. అందరూ సరైన పనులు చేయాలనే అనుకుంటారు. కానీ, తనలా చేయలేకపోతారు. ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య చోప్రాకు ఉన్న దృఢ విశ్వాసంతోనే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది."