సాధారణంగా తెరపై కనువిందు చేసే నటులకు తమ సినీప్రయాణంలో వారికి నచ్చిన ఓ అద్భుతమైన పాత్రను పోషించాలని కల ఉంటుంది. ఎవరైనా వేరే హీరో ఆ పాత్ర చేస్తే అయ్యో అలాంటి పాత్ర నేను చేయలేకపోయానే అని భావిస్తుంటారు. అలాంటి ఓ అనుభవమే జేమ్స్‌బాండ్ ఫేం డేనియల్ క్రేగ్‌కు ఎదురైందట. తనకు చిన్ననాటి నుంచే సూపర్‌హీరో పాత్రలు చేయాలనే ఆకాంక్ష ఉందని ఓ ఇంటర్వ్యూలో మనసులోని మాటను బయటపెట్టాడు. ఇంతకీ అది ఏ పాత్ర అనేదేగా మీ సందేహం. అది మరేదో కాదు.. ప్రతిఒక్కరు మెచ్చే యాక్షన్ హీరో స్తైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ది ఇన్విజిబుల్ మ్యాన్ పాత్రలట.
తాజాగా క్రేగ్ నటించిన 'నో టైమ్ టు డై' సినిమా ప్రచారంలో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆ సమాధానం చెప్పాడు. మీకు చిన్నప్పటి నుంచే జేమ్స్ బాండ్ పాత్ర చేయాలని కలగన్నారా? అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానమిస్తూ "లేదు చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. నేను నా చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ , స్పైడర్ మ్యాన్, ది ఇన్విజిబుల్ మ్యాన్, పాత్రలు చేయాలని కలలు కనేవాడిని" అని సమాధానం ఇచ్చాడు. కానీ తన కల అలానే మిగిలిపోయిందని విచారం వ్యక్తం చేశాడు.