తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి విజయాలు సాధించవచ్చని నిరూపించిన చిత్రాల్లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ముందు వరుసలో ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో యువనటుడు నవీన్ పొలిశెట్టి డిటెక్టివ్‌గా కనిపించి మెప్పించాడు. తెలుగులో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఇతర భాషల్లో అలరించేందుకు సిద్ధమవుతోంది.
తమిళ రీమేక్‌లో డిటెక్టివ్ పాత్రలో ప్రముఖ హాస్యనటుడు సంతానం కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఈ సినిమా మనోజ్ బీద దర్శకత్వంలో తెరకెక్కనుంది. సినిమా చిత్రీకరణ కూడా అతి త్వరలో ప్రారంభం కానుందని తెలిసింది. మరికొన్ని రోజుల్లో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.